పొట్ట చుట్టూ 51 సార్లు వాతలు..

– మూఢనమ్మకాలకు 3 నెలల చిన్నారి బలి
మధ్యప్రదేశ్‌ : వైద్య రంగంలో పెను మార్పులువచ్చి.. ఆధునిక చికిత్స అందుబాటులోకి వచ్చిన ఈ తరుణంలోనూ మూఢ నమ్మకానికి మూడు నెలల చిన్నారి బలైంది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గిరిజన ప్రాంతమైన షాదోల్‌ జిల్లాలోని సింగ్‌పుర్‌ కథౌటియా గ్రామానికి చెందిన మూడు నెలల చిన్నారి నిమోనియా బారినపడింది. చిన్నారికి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. తల్లిదండ్రులు పాపను వైద్యుల వద్దకు తీసుకెళ్లకుండా స్థానికంగా ఉన్న మంత్ర గాళ్లకు చూపించారు. ఈ క్రమంలో మంత్రగాళ్లు పాప పొట్ట చుట్టూ కాల్చిన ఇనుప రాడ్డుతో 51 సార్లు వాతలు పెట్టారు. దీంతో చిన్నారి ఆరోగ్యం మరింత దిగజారడంతో తల్లిదండ్రులు పసికందును స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తీసు కెళ్లారు. నిమోనియాకు సరైన సమయంలో వైద్యం అందక పోవడంతో ఇన్‌ఫెక్షన్‌ ఎక్కువై చిన్నారి మృతి చెందింది. పాపకు తల్లిదండ్రులు అంత్యక్రియలు పూర్తి చేశారు. శిశు సంక్షేమ శాఖ అధికారులు ఆస్పత్రికి వెళ్లగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వెంటనే వారు చర్యలు చేపట్టారు.