పోడుభూములను సర్వే చేసి పట్టాలివ్వాలి

– సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు
నవతెలంగాణ-కొణిజర్ల
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం ఎల్లన్ననగర్‌ గ్రామ ప్రజలు సాగుచేసుకుంటున్న పోడు భూములను సర్వే చేసి పట్టాలివ్వాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం ఎల్లన్ననగర్‌ గ్రామం నుంచి కలెక్టరేట్‌ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రను సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ప్రారంభించి మాట్లాడారు. ఎల్లన్ననగర్‌ గ్రామం నిర్మించి 30 ఏండ్లు అవుతుందని, ఇటీవలే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పోడు భూములను సర్వే చేయాలని అధికారులను అదేశించినప్పటికీ, గ్రామంలో ఉన్న పోడు భూములను ఫారెస్ట్‌ అధికారులు, రెవెన్యూ అధికారులు సర్వే చేయడం లేదని ఆరోపించారు. ఈ పాదయాత్రను చూసైనా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి గ్రామంలో పోడుభూములను సాగు చేసుకుంటున్న వారికి సర్వే చేసి పట్టాలు ఇవ్వాలని కోరారు. పాదయాత్రలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జి.వెంకటేశ్వరరావు, వైరా డివిజన్‌ కార్యదర్శి కే.అర్జున్‌రావు, మండల కార్యదర్శి పాశం అప్పారావు, గోగుల స్వాములు, రాపోలు శ్రీను, గండికోట బాబు, శ్రీను, లక్ష్మణ్‌, నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.