– మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
– మంత్రికి కాచిబౌలి ప్రజలు సత్కారం
నవతెలంగాణ-బేగంపేట్
ఆపద సమయంలో తమకు అన్ని విధాలుగా అండగా ఉండి ఆదుకొనే గొప్ప మనసున్న నాయకుడు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అని రాంగోపాల్ పేట డివిజన్ కాచిబౌలి ప్రాంతానికి చెందిన ప్రజలు తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు. ఆదివారం మంత్రిని వారు శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. గత నెలలో మినిస్టర్ రోడ్డులో జరిగిన భారీ అగ్నిప్రమాదం ఘటన తర్వాత మంత్రి శ్రీనివాస్ యాదవ్ చొరవతో పలు కుటుంబాలను ముందు జాగ్రత్త చర్యగా సురక్షిత ప్రాంతానికి తరలించి సుమారు 20 రోజుల పాటు వసతి, భోజన సౌకర్యం కల్పించిన విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ప్రమాదం జరిగిన నాటి నుంచి పలుసార్లు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితులను పర్యవేక్షిస్తూ తమలో ఎంతో మనోధైర్యం నింపారని మంత్రికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా తమ ఇండ్లకు అవసరమైన మరమ్మతులు కూడా ప్రభుత్వం ఆద్వర్యంలో చేపట్టడం, ఆర్థిక సహాయం అందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు తాను ఎల్లవేళలా అండగా ఉంటానని, సమస్యలు తన దృష్టికి వచ్చిన వెంటనే పరిష్కరిస్తానని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక అభివృద్ధి పనులు చేసి ప్రజల సమస్యలను పరిష్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలో వివిధ రాష్ట్రాలు, భాషలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారని, వారి సమస్యలను కూడా తెలుసుకొని పరిష్కరించినట్టు చెప్పారు. ఇంకా ఏ సమస్య ఉన్నా తన దష్టికి తీసుకొస్తే పరిష్కారిస్తానని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో డీవీ కాలనీలోని ప్యారడైజ్ గగన్ అపార్ట్ మెంట్‌కు చెందిన కరణ్ చౌడ, వినోద్ చౌబారియా, రాజేష్, జగదీష్, కల్పన, రాఖీ, కాచిబౌలికి చెందిన శ్రీకాంత్, వెంకట్ తదితరులు ఉన్నారు.