ప్రజల్లో మత చీలికలు… ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ వ్యూహం

బక్కపల్చటి శరీరం, చారెడంత గోధుమ రంగు కళ్లు వున్న ఆమె… చేతుల మీది గాయాలు కనిపించకుండా శాలువా చుట్టుకుంది. గొంతు మృదువుగా ఉన్నప్పటికీ మనుగడ కోసం చేసిన పోరాటాల లోంచి వచ్చిన గంభీరత ఆమె స్వరంలో ధ్వనించింది. ఆమె ఇలా చెప్పింది… ”మా గ్రామం (రామావంద్‌)లోని సంస్కృత భవన్‌లో సమావేశాలు జరిగేవి. ఆదివారం ప్రార్థనలకు వెళ్లవద్దని అక్కడ హెచ్చరిం చారు. డిసెంబర్‌ 27న నా భర్తను బైటకు లాగి కొట్టడం మొదలుపెట్టారు. తనను ఫుట్‌బాల్‌ మాదిరిగా అందరూ వంతులవారీగా తన్నారు. గ్రామ పెద్దలకు బంధువులైన ఆరుగురు మహిళలు నన్ను ఒడిసి పట్టుకున్నారు. మగవాళ్ళు నన్ను నోటికొచ్చినట్లు తిడుతూ, నాకు గుణపాఠం నేర్పమని వారికి చెప్పారు. నా జుట్టు పట్టుకుని పీకారు. నా తల మీద పదే పదే కొట్టారు. అంటితో ఆగక తలను నేలకేసి కొట్టారు. ఈ ఘర్షణలో నా జాకెట్‌ చిరిగిపోయింది. మా గ్రామంలో క్రీస్తును నమ్మిన పదకొండు మంది మహిళలు, ఒక యువకుడితో సహా అందరూ ఇలాంటి హింసను ఎదుర్కొన్నారు. మీరు ప్రశాంతంగా బతకాలను కుంటే మా సమాజానికి తిరిగి రండి (‘ఘర్‌ వాపస్‌’) అన్నారు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. ప్రార్థనలు మాత్రమే చేశానన్నాను”. ఆమెకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. కానీ ఎటువంటి చర్య తీసుకోలేదు. ఉత్తర బస్తర్‌లోని కంకేర్‌, కొండగావ్‌, నారాయణపూర్‌ జిల్లాల్లోని క్రైస్తవ సమాజానికి చెందిన 500 ఆదివాసీ కుటుంబాలలో ఆమె కుటుంబం కూడా ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో, గత ఏడాది అక్టోబర్‌ నుంచి తమపై జరిగిన మూకుమ్మడి దాడుల కారణంగా వారు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ప్రతినిధి బృందంతో కలిసి ఇటీవల బాధిత ప్రాంతాలకు వెళ్లినప్పుడు మహిళల మీద జరిగిన అత్యంత క్రూరమైన దాడుల గురించి చాలా తక్కువగా పేర్కొన్నారు. డిసెంబరులో 1,500 మంది ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరాలు, చర్చిలు, బంధువులు-స్నేహితుల ఇళ్లలో ఆశ్రయం పొందాల్సి వచ్చింది. 200 మందికి పైగా ఇప్పటికీ తిరిగి స్వగ్రామాలకు రాలేకపోయారు. నారాయణపూర్‌లోని ప్రధాన చర్చి, ”ప్రార్థన గదులు”తో సహా ఇతర జిల్లాల్లోని చర్చిలను ధ్వంసం చేశారు. కొన్ని చోట్ల దగ్ధం చేశారు. ఇళ్లను పగలగొట్టి దోచుకున్నారు. నారాయణపూర్‌ చర్చిపై దాడి కేసుకు సంబంధించి అరెస్టయిన వారిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు, ఇతర స్థానిక నాయకులు ఉన్నారు. మత మార్పిళ్లకు వ్యతిరేకంగా భజరంగ్‌ దళ్‌, విహెచ్‌పి వంటి ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థల నేతృత్వంలోని ”ఘర్‌ వాపసీ” ప్రచారం కొత్తదేమీ కాదు. తేడా ఏమిటంటే ఈసారి ‘జన్‌ జాతి సురక్షా మంచ్‌’ (జెఎస్‌ఎం) వంటి వేదికలను సృష్టించడం ద్వారా, మత మార్పిళ్ల నుంచి తమ సంప్రదాయాలను రక్షించుకోడానికి ఆదివాసీలు స్వయంగా లేవనెత్తిన ఒక ఆకస్మిక ఉద్యమంగా దీనిని చూపించారు. అయితే ఇది అలాంటిది కాదు. నవంబర్‌ మొదటి వారంలో, జెఎస్‌ఎం చేసిన నిరసన ప్రదర్శనకు ఆ ప్రాంతానికి చెందిన మాజీ బీజేపీ ఎమ్మెల్యే, గిరిజన నేత నాయకత్వం వహించారు. కామెర్ల వ్యాధితో మరణించిన 55ఏండ్ల ఆదివాసీ క్రైస్తవ మహిళ చైతీ బాయి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు తమ సొంత భూమిలో పూడ్చిపెట్టాలని డిమాండ్‌ చేస్తూ రెచ్చగొట్టే ప్రసంగం చేశారు. గ్రామంలో ఒక క్రైస్తవుని ఖననం చేయడం ‘గ్రామ దేవతకు కోపం తెప్పిస్తుంది. గ్రామాన్ని నాశనం చేస్తుంది’ అని చెప్పుకొచ్చాడు. చైతీ బాయి కుటుంబానికి ఎంతగా బెదిరింపులు వచ్చాయంటే… వారు గ్రామం విడిచి వెళ్లిపోయేంతగా. మరుసటి రోజు రాత్రి అతని అనుచరులు సమాధిని తవ్వి ఆమె మృతదేహాన్ని బయటకు లాగారు. ఇలాంటి చట్టవిరుద్ధమైన, అనాగరికమైన చర్యపై అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా మృతదేహాన్ని తీసుకెళ్లి 100కిలోమీటర్ల దూరంలోని క్రైస్తవ శ్మశానవాటికలో పాతిపెట్టింది. దీంతో జెఎస్‌ఎం ఇటువంటి మరిన్ని చర్యలకు పాల్పడేందుకు ఊతమిచ్చినట్లయింది. దాంతో క్రైస్తవుల మీద హింసాత్మక దాడులు మరింత పెరిగాయి. ఇలాంటి చర్యలకు ఆదివాసీ సంస్కృతుల రక్షణకు ఎటువంటి సంబంధం లేదు. చనిపోయినవారిని ఆదివాసీలు పాతిపెడతారు. చనిపోయినవారిని క్రైస్తవులు తమ స్వంత భూమిలో పాతిపెట్టినప్పుడు… భారతదేశంలో ఆదివాసీలు నివసించే ఏ ప్రాంతంలోనూ సమస్య కాలేదు. ఇది ఆదివాసీ సంస్కృతులను హిందుత్వీకరించేందుకు తయారు చేసిన ఎజెండా మాదిరిగా కనిపిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో 2006లో అప్పటి బీజేపీ ప్రభుత్వ హయాంలో బలవంతపు మత మార్పిళ్లకు వ్యతిరేకంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే ప్రస్తుతం మత మార్పిళ్లకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారానికి భిన్నంగా… బలవంతంగా మత మార్పిడి చేసినట్లుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. మనస్సాక్షి స్వేచ్ఛకు రాజ్యాంగం కల్పించిన హక్కుపై దాడి జరుగుతోంది. ఆదివాసీ ప్రాంతాలలో దేవాలయాలు నిర్మించ బడుతున్నాయి. కీర్తనలు, భజన మండళ్లు నిర్వహించ బడుతున్నాయి. ఆదివాసీ విశ్వాసాలు, సంస్కృతులకు దూరంగా విగ్రహారాధనకు అనుసంధానించబడిన ఆచారాలు బహిరంగంగా ప్రచారం చేయబడుతున్నాయి. ఆదివాసీ సంప్రదాయాల దృష్టి కోణం నుండి చూసినట్లయితే వాటిని వారి మీద రుద్దినట్టుగా పరిగణించవచ్చు. మత మార్పిడికి ఏర్పాటు చేసినట్టు భావించవచ్చు. ఆదివాసీలలోని క్రైస్తవ విశ్వాసులను ”ఇంటికి తిరిగి” రమ్మని బెదిరించినప్పుడు, ఏ ఇంటిని సూచిస్తారు? ఇతర మతాల నుండి వేరుగా ఉన్న ఆదివాసీల నమ్మకాలు, విశ్వాసాలను సూచించడానికి వీలుగా జనగణన పత్రంలో ”సర్నా, ఆదివాసి” కాలమ్‌ను జోడించాలన్న తీర్మానాన్ని జార్ఖండ్‌లోని జెఎంఎం ప్రభుత్వం నేతృత్వంలోని అసెంబ్లీ ఆమోదించింది. రెండు ఇనుప ఖనిజం ప్రాజెక్టులకు వ్యతిరేకంగా నారాయణపూర్‌లోని ఆదివాసీలు పోరాడుతున్నారు. చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా గ్రామసభల అనుమతి లేకుండానే ఈ ప్రాజెక్టులను తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు నిలిపివేసిన ఒడిశా నియమ్‌గిరి ప్రాజెక్టు మాదిరిగానే… ఈ ప్రాజెక్టులు ఆదివాసీలు పవిత్రమైనవిగా భావించే ప్రాంతాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. దీనిపై జన్‌ జాతి సురక్షా మంచ్‌ మౌనంగా ఉంది. ఘర్‌ వాపసీ ప్రచారం ద్వారా… గ్రామసభ అనుమతి లేకుండా గ్రామాల్లోకి క్రైస్తవ పాస్టర్ల ప్రవేశాన్ని నిషేధించే తీర్మానాలను ఆమోదిస్తున్నారు. తద్వారా గ్రామసభ హక్కును వక్రీకరిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో రాష్ట్ర ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో… ప్రజల మధ్య చీలికలు సృష్టించి లబ్ధి పొందాలన్న బీజేపీ సహజమైన వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఆ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఒక్క మంత్రిని కూడా పంపని, ఒక్క బాధిత కుటుంబానికి కూడా నష్టపరిహారం అందించని కాంగ్రెస్‌ ప్రభుత్వం గురించి ఏం చెప్పాలి?చర్చిపై రాళ్ల దాడిలో ఒక పోలీసు అధికారి గాయపడిన తర్వాత మాత్రమే అరెస్టులు జరిగాయి. మహిళలతో సహా బాధితులు ఎన్ని ఫిర్యాదులు చేసినా, కొన్ని కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినా వారెవరినీ అరెస్టు చేయలేదు. నారాయణపూర్‌ ఎమ్మెల్యే కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కూడా. సరిగ్గా బాధితులకు అత్యవసరమైన సందర్భాలలో ఆయన కనిపించకుండా తప్పుకున్నారు. భారత దేశాన్ని ఏకం చేసే మార్గం ఇదేనా?
– ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ సౌజన్యంతో
– బృందా కరత్‌