ప్రజల పైసలతో ఆటలా?

– ఎల్‌ఐసీ పెట్టుబడులు ఆవిరవుతుంటే మౌనం ఎందుకు?
– అదాని వ్యవహారంపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం
– ముంబయిలో ఘనంగా స్వాగతం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ఆదాని కుంభకోణంలో ప్రజలు పెట్టుబడులు పెట్టిన ఎల్‌ఐసీ సంస్థ డబ్బులు ఆవిరవుతుంటే, ఎందుకు మౌనంగా ఉందని బీఆర్‌ఎస్‌ కల్వకుంట్ల కవిత కేంద్రాన్ని ప్రశ్నించారు. అదాని కంపెనీల్లో ఎల్‌ఐసీ పెట్టిన పెట్టుబడుల విలువ 11 శాతం మేర పడిపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ముంబాయిలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు ఆమెకు ఘన స్వాగతం పలికారు.అనంతరం కవిత మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ విగ్రహానికి నివాళులర్పించారు. అ సందర్భంగా కవిత మాట్లాడుతూ ప్రజల డబ్బులతో ఆటలాడటం ఏంటని ప్రశ్నించారు. ఎల్‌ఐసీలో పెట్టుబడులు పెట్టిన మధ్య తరగతి ప్రజలకు మోడీ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని నిలదీశారు. ఇంత పెద్ద కుంభకోణం జరిగి దాదాపు రూ. 12 లక్షలకోట్లు నష్టపోయినా సీబీఐ, ఈడీ, ఆర్‌బీఐ వంటి సంస్థలు ఎందుకు మౌనంగా ఉంటున్నాయని ప్రశ్నించారు. సంస్థలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే సంస్థలేనా? అని నిలదీశారు. హిడెన్‌బర్గ్‌ నివేదిక బహిర్గతమైనప్పటి నుంచి ఆదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశారు. అప్పుడే కేంద్రం జెపిసి ఏర్పాటు చేస్తే ప్రజలు మరింత నష్టపోయేవారు కాదని తెలిపారు. ఇప్పటికైనా కేంద్రం కండ్లు తెరిచి మరింత నష్టం జరగకుండా చూడాలని సూచించారు.తెలంగాణలో జరుగుతున్న పనులు మహారాష్ట్రలో ఎందుకు జరగలేదని కవిత ప్రశ్నించారు. ముంబాయిలో రోజుకు రెండు గంటలే మంచినీళ్లు సరఫరా అవుతున్నాయని తెలిపారు. రానున్న కాలంలో మహారాష్ట్ర అభివృద్ధిలో తమ పార్టీ కీలక భాగస్వామి అవుతుందనీ, ఇక్కడి ప్రజల కోసం తాము పని చేస్తామని చెప్పారు. ఈ పర్యటనలో శరత్‌పవార్‌, ఉద్ధవ్‌ ఠాక్రే వంటి నాయకులను కలుస్తారా? అని విలేకరులు అడగ్గా… శరత్‌ పవర్‌తో కేసీఆర్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనీ, ఉద్యమానికి కూడా ఆయన ఎంతగానో తోడ్పడ్డారని వివరించారు. కార్యక్రమంలో మహారాష్ట్ర బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.