ప్రజాస్వామ్య రక్షణ మీది..మీ ఆరోగ్య రక్షణ మాది..

–  పోలీసుల ఆరోగ్య రక్షణకు ప్రత్యేక చర్యలు: మంత్రి హరీశ్‌రావు
–  సంగారెడ్డి పోలీస్‌ ఆరోగ్య రక్ష మెడికల్‌ క్యాంపు ప్రారంభం
నవతెలంగాణ-సంగారెడ్డి
ప్రజాస్వామ్య రక్షణలో నిమగమైన పోలీసుల ఆరోగ్య రక్షణ బాధ్యత తమదని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అందులో భాగంగా ముందుగా సంగారెడ్డి జిల్లా వైద్య కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీస్‌ ఆరోగ్యరక్ష మెడికల్‌ క్యాంపుతో పాటు గాంధీ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించి మాట్లాడారు. బీబీనగర్లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎయిమ్స్‌ మెడికల్‌ కాలేజీ.. పేరు గొప్ప గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ఉన్నదని ఆరోపించారు. 58 ఏండ్లుగా తెలంగాణకు కేవలం మూడు కాలేజీలే ఉండేవని.. ఈ ఎనిమిదేండ్ల కాలంలో 12 మెడికల్‌ కాలేజీలను.. మౌలిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. పోలీస్‌ మెడికల్‌ క్యాంప్‌ మొదటి విడతగా సిద్దిపేట జిల్లాలో ప్రారంభించగా.. రెండో విడతగా సంగారెడ్డిలో ప్రారంభించినట్టు తెలిపారు. విధి నిర్వహణలో భాగంగా రాత్రింబవళ్లు కష్టపడుతూ.. సమయానికి సరైన భోజనం లేక పోలీసులు అనారోగ్యాలకు గురవుతున్నారని.. అలాంటి వారికి ఈ ఆరోగ్య రక్ష కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ ఆరోగ్య రక్ష మెడికల్‌ క్యాంపులో భాగంగా 57 రకాల పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీ జయపాల్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ ఎ. శరత్‌, జిల్లా ఎస్పీ యం.రమణ కుమార్‌, అదనపు ఎస్పీ టి.ఉష విశ్వనాథ్‌, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌, డీఎంహెచ్‌ఓ గాయత్రి, మెడికల్‌ సూపరిండెంట్‌ అనిల్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.