
– ప్రజా సంఘాల మహాధర్నా కరపత్రాల ఆవిష్కరణ
నవతెలంగాణ – సిరిసిల్ల టౌన్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా కార్మిక వ్యతిరేక బడ్జెట్ అని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు ఆరోపించారు. గురువారం పట్టణంలోని అమృతలాల్ శుక్లా కార్మిక భవనంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను వ్యతిరేకిస్తూ ఈ నెల 10 హైదరాబాదులో నిర్వహించే ప్రజా సంఘాల మహా ధర్నాకి సంబంధించి కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, కేవలం కార్పొరేట్ శక్తులకు అనుకూలమైన బడ్జెట్ అని విమర్శించారు. కార్మికులు, రైతులు, కూలీల కు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. సిరిసిల్ల పరిశ్రమ కు బడ్జెట్ లో నిధులు ఎందుకు కేటాయించలేదన్నారు. స్థానిక ఎంపీ తన పదవికి రాజీనామా చేసి తెలంగాణ తరుపున పోరాడాలని సూచించారు. రాష్ట్రానికి నిధులు తెస్తారా రాజీనామా చేస్తారో ప్రజలకు తెలపాలన్నారు. ప్రజాసంఘాల మహా ధర్నాకు జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ, జిల్లా ఉపాధ్యక్షులు మూశం రమేష్, అన్నల్ దాస్ గణేష్, ఐద్వా జిల్లా అధ్యక్ష , కార్యదర్శులు సూరం పద్మ , జవ్వాజీ విమల , కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఎర్రవల్లి నాగరాజు , ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఆదిత్య , వివిధ ప్రజాసంఘాల నాయకులు నక్క దేవదాస్ , ఓడ్నాల వీరేశం , గడ్డం రాజశేఖర్ , శ్రీనివాస్ , రమేష్ , నరసయ్య తదితరులు పాల్గొన్నారు.