ప్రజా పంపిణీపైనా ప్రయివేటు కత్తి

– ‘నిటి ఆయోగ్‌’ సిఫారసులతో బడ్జెట్‌లో కోతలు : ద రిపోర్టర్స్‌ కలెక్టివ్‌
న్యూఢిల్లీ : ఎన్నో కోట్ల కుటుంబాలకు ఆధారమైన ‘ప్రజా పంపిణీ వ్యవస్థ’ (పీడీఎస్‌్‌)ను మోడీ సర్కార్‌ భారంగా భావిస్తోంది. కొత్త బడ్జెట్‌లో ఆహార సబ్సిడీలపై భారీ ఎత్తున కోతలు పెట్టింది. వ్యయ నియంత్రణలు, ఉచిత ఆహార పథకం పరిధిని కుదించటమే లక్ష్యంగా కేంద్రం అడుగులు వేస్తోంది. పీడీఎస్‌్‌ను ప్రయివేటుకు అప్పగించాలని, పథకం పరిధిని వీలైనంతగా కుదించాలని ‘నీతి ఆయోగ్‌’ ఇచ్చిన నివేదికను అమలుజేయడానికి కేంద్రం సిద్ధమైంది. ‘నిటి ఆయోగ్‌’ కేంద్రానికి సమర్పించిన నివేదిక పత్రాల్ని సేకరించిన ‘ద రిపోర్టర్స్‌ కలెక్టీవ్‌’ సంచలన విషయాలు బయటపెట్టింది. ఆహార భద్రత కార్యక్రమాలకు, ప్రజా పంపిణీ వ్యవస్థ అమలుపై ‘నిటి ఆయోగ్‌’ వ్యతిరేకత వ్యక్తం చేసిందని ఈ పత్రాల్లో స్పష్టంగా ఉంది. ఆహార సబ్సిడీ పథకాలకు మంగళం పాడాలని కేంద్రానికి సూచించింది. ఈ నివేదికలోని అంశాల ఆధారంగా సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్‌ కూడా దాఖలు చేసింది. 2021 జనాభాకు అనుగుణంగా పీడీఎస్‌ పథకాన్ని విస్తరించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ కొత్త బడ్జెట్‌లో కేంద్రం ఆహార సబ్సిడీలో పెద్ద ఎత్తున నిధులకు కోతలు విధించింది. ఇదంతా కూడా నిటి ఆయోగ్‌ సూచనలు, సిఫారసుల ప్రకారం జరిగిందని ప్రభుత్వ పత్రాలు చెబుతున్నాయి. కొత్త బడ్జెట్‌లో కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఆహార సబ్సిడీలో రూ.1.79,844 కోట్లమేర కోతలు విధించడానికి కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసిందని సమాచారం. ఆహార ధాన్యాల సేకరణ ప్రయివేటు, కార్పొరేట్‌ రంగాలకు అప్పగించాలని నిటి ఆయోగ్‌ సూచించింది. ప్రజా పంపిణీ పథకాల్లోనూ వాటి భాగస్వామ్యం తీసుకురావాలని కేంద్రానికి తెలిపింది. ఈమేరకు కేంద్రం తగిన కార్యచరణ చేపడుతోందని, ‘నిటి ఆయోగ్‌’ సూచనల మేరకు బడ్జెట్‌ గణాంకాలు వెలువడ్డాయని విశ్లేషకులు చెబుతున్నారు.