నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్ :
ప్రజా సమస్యల పట్ల ప్రతిపక్షాలకు చిత్తశుద్ధి లేదని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. శనివారం సభలో మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పద్దులపై మాట్లాడుతుండగా ప్రతిపక్ష సభ్యులెవరూ సభలో లేరు. ఈ విషయాన్ని వేముల స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలు తమకు సమయం ఇవ్వటం లేదంటూ బయట విమర్శలు గుప్పిస్తున్నాయనీ, సమయమిస్తే మాత్రం తమకు కావాల్సిన రాజకీయాలు మాట్లాడి సభ నుంచి వెళ్లిపోతున్నారంటూ విమర్శించారు. ఇది చాలా అన్యాయ మని అన్నారు. రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ముఖ్యమైన పద్దులపై మంత్రులు సమాధాన మిస్తుంటే ప్రతిపక్ష సభ్యులు సభలో లేకపోవడం విచారకరమని తెలిపారు. వారిని పిలిచి మాట్లాడాలంటూ స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు.