ప్రభుత్వంపై లడాయికి ఆదివాసీలు సిద్ధం కావాలి

నవతెలంగాణ-ఓయూ
బంగారు తెలంగాణ పేరుతో రాష్ట్రంలోని ఆదివాసీ ప్రజల ఆస్తిత్వాన్ని సమాధి చేస్తున్న ప్రభుత్వంపై లడాయి చేయటానికి ఆదివాసీ సమాజం సిద్ధం కావాలని ఉస్మానియా యూనివర్సిటీ ఆదివాసి స్టూడెంట్స్‌ ఫోరం రాష్ట్ర నాయకులు, ఆదివాసీ పరిశోధన విద్యార్థులు సాగబోయిన పాపారావు పిలుపునిచ్చారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్‌ ఆదివాసుల జీవితాల్లో చీకటి అధ్యాయానికి శ్రీకారం చుట్టారనీ, ఇది చారిత్రక తప్పిదానికి తెర లేపారనీ, ఉస్మానియా ఆదివాసి విద్యార్థులుగా భావిస్తున్న ట్టు చెప్పారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం 11 కులాలు అయినా వాల్మీకి, బోయ, బేదర్‌, కిరాతక, నిషాది, పెద్ద బోయలు, తలయారి, చుండువాళ్లు, ఖాయతీలం బాడ, ఖాట్‌ మధురలు, చమర్‌ మధురలను ఎస్టీ జాబితాలో చేర్చడం రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయం వ్యక్తం చేశారు. అడవులపై ఆదివాసులకు హక్కు లేదనే అధికారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ఎవరిచ్చారు అని ప్రశ్నించారు. ఆదివాసీ ప్రజలు సాగు చేసుకుంటున్న పోడు భూములకు హక్కు పత్రాలు ప్రభుత్వ భిక్ష కాదనీ, ఆదివాసీ ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కు అనే విషయం ప్రభుత్వం గుర్తించాలని పేర్కొన్నారు. పోడు భూముల పట్టాల కోసం ఆదివాసీ రైతులకు షరతులు ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తామని హెచ్చరించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయాన కుర్చీ వేసుకుని కూర్చుని ఎక్కడికక్కడ ఆదివాసులకు హక్కు పత్రాలు ఇస్తానన్నారనీ, నేడు అసెంబ్లీ సమావేశాల్లో ఆదివాసులకు అడవులపై హక్కు లేదంటూ అడవులను విధ్వంసం చేస్తున్నారని ప్రకటించడం అంటే ఆదివాసుల్ని మోసం చేయడమే అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ పరిశోధన విద్యార్థు లు అరె.ఆరుణుకూమర్‌, బొచ్చు నరేష్‌, లక్ష్మణ్‌, కుంజ కోటి, ఆదివాసీ విద్యార్థులు బట్ట వెంకటేశ్వర్లు, మడవి అజరు, అశోక్‌, వివేక్వర్ధన్‌, సౌజన్య, శైలజ, దివ్య, నాగమణి, కాత్యాయని, హరిదాస్‌ పాల్గొన్నారు.