ప్రభుత్వాస్పత్రుల్లో… గుండెజబ్బు పిల్లలకు శస్త్రచికిత్సలు

– మంత్రి హరీశ్‌ రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గుండెజబ్బు కలిగి శస్త్రచికిత్స అవసరమైన చిన్నారులకు ప్రభుత్వాస్పత్రుల్లోనే చేసేలా అవసరమైన మౌలిక సదుపాయాలు, సిబ్బంది తదితర ఏర్పాట్లు చేస్తున్నట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఏటా ఆరు లక్షల జననాలు జరుగుతుండగా, అందులో 5,400 మంది వరకు పిల్లల్లో గుండె జబ్బులుంటున్నాయనీ, వారిలో వెయ్యి మంది వరకు శస్త్రచికిత్స అవసరముంటుందని వివరించారు. పేదలు కార్పొరేట్‌కి వెళ్ళలేక, సరైన సమయంలో వైద్యం అందక కొందరు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మానవీయకోణంలో అలోచించి వీరికి శస్త్ర చికిత్సలను ప్రభుత్వాస్పత్రుల్లో నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇటీవల తొమ్మిది మంది చిన్నారులకు నిమ్స్‌, నీలోఫర్‌లో గుండె శస్త్రచికిత్సలు నిర్వహించిన వైద్యులకు సహకరించిన బ్రిటన్‌ వైద్య బృందానికి నిమ్స్‌లో శనివారం సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీశ్‌ రావు మాట్లాడుతూ డాక్టర్‌ వెంకట రమణ దన్నపనేని తమ బృందంతో వచ్చి నిలోఫర్‌, నిమ్స్‌ వైద్యులకు సహకారం అందించారు. అందరూ కలిసి తొమ్మిది మంది చిన్నారులకు సర్జరీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిమ్స్‌ ఇంచార్జి డైరెక్టర్‌ బీరప్ప, నిలోఫర్‌ సూపరింటెండెంట్‌ ఉషారాణి, సర్జరీలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు. తనకు జన్మనిచ్చిన రాష్ట్రంలోని ప్రజలకు సేవ చేయాలని వచ్చిన డాక్టర్‌ రమణకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. నిమ్స్‌లో కొత్త బ్లాక్‌ ఏర్పాటు చేస్తున్నామనీ, 32 ఎకరాల ప్రభుత్వ భూమిని నిమ్స్‌కు అప్పగించామనీ, మరో 2,000 పడకలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. భవిష్యత్‌ అవసరాలు తీర్చేలా హైదరాబాద్‌ నాలుగు వైపులా నాలుగు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు రానున్నాయన్నారు. వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి దసరా నాటికి సిద్ధమవుతుందని తెలిపారు.