– హెచ్సీఏ అకౌంట్లపై ఏకసభ్య కమిటీకి శివలాల్ వినతి
– జస్టిస్ నాగేశ్వరరావుతో హెచ్సీఏ అధికారుల సమావేశం
నవతెలంగాణ, హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) 2019-2022 అకౌంట్లను ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలని సుప్రీంకోర్టు నియమిత ఏకసభ్య కమిటిని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్. శివలాల్ యాదవ్ కోరారు. ‘హెచ్సీఏలో చోటుచేసుకున్న అక్రమ పనుల గురించి జస్టిస్ నాగేశ్వర రావుకు వివరించాను. అందుకు కారణమైన వ్యక్తి ఎవరో తెలియజేశాను. జనరల్ బాడీ సమావేశంలో అకౌంట్లకు ఆమోదం తెలపని కారణంగా రూ.100 కోట్ల నిధులను బీసీసీఐ నిలిపివేసింది. ఎన్నికైన పాలకవర్గంతోనే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని కమిటీని కోరాను’ అని శివలాల్ యాదవ్ తెలిపారు. జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు ఏక సభ్య కమిటీ గురువారం ఉప్పల్ స్టేడియంలో హెచ్సీఏ అధికారులతో సమావేశమయ్యారు. తాజా మాజీ ఆఫీస్ బేరర్లు మహ్మద్ అజహరుద్దీన్, ఆర్. విజయానంద్, జాన్ మనోజ్, అనురాధ, నరేశ్ అగర్వాల్, సురేందర్ అగర్వాల్ సహా బడ్డింగ్ స్టార్స్, చార్మినార్ క్రికెట్ క్లబ్ ప్రతినిధులు ఏకసభ్య కమిటీని కలిశారు.