నవతెలంగాణ-దుబ్బాక రూరల్
ఏపీ మాదిరిగా తెలంగాణలో పని చేస్తున్న ఆశవర్కర్లకు కనీసం వేతనాలు ఇవ్వాలని, రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఆశ వర్కర్లకు తగిన బడ్జెట్ కేటాయించాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు జి. భాస్కర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్క పేట, తిమ్మాపూర్ పీహెచ్సిల ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశవర్కర్లతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం ఇరు పీహెచ్సి మెడికల్ ఆఫీసర్లకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు జి. భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సుమారు 26వేల మంది ఆశా వర్కర్లు పని చేస్తున్నారని, వీరంతా బడుగు, బలహీన వర్గాలకు చెందిన మహిళ ఆశవర్కర్లని అన్నారు.
వీరంతా గత 18 సం॥రాల నుండి రాష్ట్రంలోని పేద ప్రజలకు ఆరోగ్య సేవలందిస్తూ.. పాతోషికాల పనితో పాటు పారితోషికాలు లేని అనేక అదనపు పనులు (కంటి వెలుగు, లెప్రసీ తదితర పనులు) ఈ ఆశ వర్కర్లే చేస్తున్నారని తెలిపారు. పనిభారం గతంతో పోలిస్తే అనేక రెట్లు పెరిగిందే కానీ ఇన్ని పనులు చేస్తున్న ఆశాలకు నేటికీ ఫిక్సిడ్ వేతనం అమలు చేయడం లేదని ప్రభుత్వాన్ని విమర్శించారు. పెన్షన్, ఈ.ఎస్.ఐ, ఉద్యోగ భద్రత,కనీసం ప్రసూతి సెలవులు కూడా ప్రభుత్వం నేటికీ ఆశాలకు ఈ ప్రభుత్వం నిర్ణయించలేదన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నట్లు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆశాలకు పదివేల రూపాయల ఫిక్సిడ్ వేతనం నిర్ణయించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పెరిగిన ధరలకనుగుణంగా కనీస వేతనం చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉందనీ అన్నారు. ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో రాష్ట్రంలో పని చేస్తున్న ఆశాల సమస్యల పరిష్కారం కోసం తగిన బడ్జెట్ రూపొందించాలని కోరారు. కార్యక్రమంలో ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు మంజుల,శ్యామల, భాగ్యలక్ష్మి, సంతోష, లత, శోభ, భారతి, దేవలక్ష్మీ, రజిత, మమత తదితులు పాల్గొన్నారు.