బీజేపీ పాలనలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం

–  దేశ సంపదను ఆదానీకి కట్టబెట్టేందుకు కుట్ర
– బీజేపీని ప్రతిఘటించండి..
గద్దె దించండి: రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ మహబూబాబాద్‌
‘దేశంలోని బీజేపీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైందని, జాతీయ సంపదను ఆదానీకి కట్టబెట్టేందుకు మోడీ కుట్ర పన్నుతున్నాడని, దీన్ని హిడెన్‌ బర్గ్‌ గుట్టురట్టు చేశారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. గురువారం మహబూబా బాద్‌ జిల్లా కేంద్రంలోని పెరుమాండ్ల జగన్నాథం భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తమ్మినేని మాట్లాడారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అతని మిత్రుడైన గౌతమ్‌ అదానీకి దేశ సంపదను కట్టబెట్టడంతో పాటు ప్రపంచ కాంట్రాక్టులు ఇప్పించడంతో అదానీ ఆస్తులు మూడవ స్థానానికి పెరిగాయని అన్నారు. ఎస్బీఐ బ్యాంకు లక్షల కోట్ల రూపాయలు, ఎల్‌ఐసీ వేల కోట్ల రూపాయల సంపదను ఆదానీకి కట్టబెట్టేందుకు మోడీ చేసిన కుట్రలను హిడెన్‌బర్గ్‌ బహిర్గతం చేయడంతో దేశంలో ఆదానీ ఆస్తులు రూ.1,20,000 బిలియన్‌ కోట్లు తగ్గి 49వ స్థానానికి పడిపోయాయని తెలిపారు. ఫలితంగా సామాన్య ప్రజల సంపద రూ.20లక్షల కోట్లు ఆవిరయ్యాయన్నారు. మోడీ, ఆదానీల అక్రమాలు బయటపెడుతున్న జర్నలిస్టులను చంపుతామని బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని అక్రమాలపై సుప్రీంకోర్టు స్పందించడంతో పార్లమెంట్‌ జాయింట్‌ కమిటీ వేయడానికి ముందుకు వచ్చారని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ మతోన్మాదంతో ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ బలపడటానికి ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. బీజేపీ అధ్యక్షులు బండి సంజరు సచివాలయ గుమ్మటాలు కాలుస్తామని, మసీదులు నేలమట్టం చేస్తామని ప్రకటించడం దారుణమ న్నారు. రాష్ట్రంలో బీజేపీ రాకుండా అడ్డుకుంటా మని అన్నారు. బీజేపీని ఎదుర్కొనేందుకు కేసీఆర్‌ సిద్ధమయ్యారని, అందుకే బీఆర్‌ఎస్‌కు మద్దతిస్తు న్నట్టు తెలిపారు. రాష్ట్రంలో, కేంద్రంలో ప్రతిపక్ష ఐక్యవేదిక ప్రయత్నం చేసేందుకు బీఆర్‌ఎస్‌తో కలిసి పని చేస్తున్నామని తెలిపారు. బీజేపీ పాల నలో అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగాయని, ప్రజల జీవన విధానం అస్తవ్యస్తమైందన్నారు. ఎరు వుల రాయితీ తగ్గించారని, గ్యాస్‌ ధరలు పెంచా రని, ఉపాధి హామీ నిధులు తగ్గించారని గుర్తు చేశారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 25 జిల్లాల్లో లక్షకు పైగా వేసిన గుడిసెలకు రాష్ట్ర ప్రభుత్వం ఇండ్ల పట్టాలివ్వాలని కోరారు. పేదల గృహాలకు ప్రభుత్వం ఇస్తానన్న రూ.3 లక్షలను రూ.5లక్షలకు పెంచాలన్నారు. గిరిజనులు, గిరిజ నేతలు సాగుచేస్తున్న పోడు భూములకు పట్టలి వ్వాలని కోరుతామన్నారు. గుత్తి కోయలకు కూడా హక్కు పత్రాలు ఇవ్వాలని కోరారు. పేదలకు రేషన్‌ కార్డులు, పెన్షన్లు రైతుబంధు, ధరణి లోపాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. ప్రజా సమస్యలపై ప్రజలను చైతన్యం చేస్తూ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తామని తెలిపారు. రాష్ట్ర విభజన హామీలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు. సమావేశంలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య, జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్‌, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సుర్ణపు సోమయ్య, ఆకుల రాజు, గునిగంటి రాజన్న, శెట్టి వెంకన్న, పాల్గొన్నారు.