భారత నియంత్రణ సంస్థలు దిట్ట

– అదాని కేసును చూసుకుంటాయి
– మంత్రి సీతారామన్‌ వెల్లడి ఆర్‌బిఐ బోర్డుతో భేటీ
– ద్రవ్యోల్బణం 5.3 శాతానికి తగ్గొచ్చు : శక్తికాంత దాస్‌
న్యూఢిల్లీ: అదాని గ్రూపు సంక్షోభంపై ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ మరోమారు స్పందించారు. భారత నియంత్ర ణ సంస్థల్లో అనుభవమున్న వ్యక్తు లు, నిపుణులు ఉన్నారని, ఎప్పటి లానే వాటి పని అవి చేస్తున్నాయ ని మంత్రి పేర్కొన్నారు. శనివారం మంత్రి ఆర్‌బిఐ బోర్డుతో భేటీ అయ్యారు. అనంతరం ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌తో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. అదానీ గ్రూపునపై వచ్చిన తీవ్ర ఆరోపణలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి ఒక్క మాటలో భారత రెగ్యూలేటరీ సంస్థలు వాటి పని అవి చూసుకుంటాయన్నారు. కొత్త పన్ను విధానం వల్ల మధ్య తరగతికి చెందిన వేతన జీవులకు మేలు జరుగుతుందన్నారు. చేతిలో డబ్బులు మిగిల్చే ఉద్దేశ్యంతోనే నూతన పన్ను విధానం ప్రవేశపెట్టామన్నారు. క్రిప్టో కరెన్సీల అంశంలో నియమ, నిబంధనలపై జి 20 దేశాలతో చర్చిస్తున్నా మన్నారు. ఆర్‌బిఐ బోర్డు అంతర్జాతీయ, జాతీయ ఆర్థిక పరిస్థితులు, సవాళ్లను సమీక్షించిందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రతి ఏడాది కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ఆర్థిక మంత్రి ఆర్‌బిఐ బోర్డును ఉద్దేశించి మాట్లాడుతారు. ఈ ఆనవాయితీగానే 2023-24 బడ్జెట్‌ ప్రకటన తర్వాత మంత్రి సీతారామన్‌ భేటీ అయ్యారు. బడ్జెట్‌పై ఆర్థిక మంత్రిని అభినందిస్తూ, ఆర్‌బిఐ బోర్డు సభ్యులు ప్రభుత్వం పరిశీలన కోసం కొన్ని సూచనలు చేశారని అధికార వర్గాలు తెలిపాయి. ముడి చమురు ధరలు స్థిరంగా ఉంటే 2023-24లో ద్రవ్యోల్బణం 5.3 శాతానికి చేరనుందని ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో బ్యారెల్‌ చమురు 95 డాలర్లు ఉండొచ్చన్నారు. రుణాలు, డిపాజిట్లపై వడ్డీ రేట్లు అనేవి పోటీ మార్కెట్‌ నిర్ణయిస్తుందన్నారు. వడ్డీ రేట్లు ఇప్పుడిప్పుడే సానుకూలంగా మారాయని అన్నారు. దీర్ఘ కాలానికి ప్రతికూల లేదా అధిక వడ్డీ రేట్లు అస్థిరతను సష్టించగలవన్నారు. వడ్డీ రేటు పెరుగుదల ధరల స్థిరత్వంలో ఒక బాగమన్నారు. ఇటీవలి ఆర్‌బిఐ రెపో రేటు 25 బేసిస్‌ పాయింట్ల పెంచి 6.50 శాతానికి చేర్చిన విషయం తెలిసిందే. సర్వీస్‌ సెక్టార్‌ ఎగుమతులు చాలా బాగా జరుగుతున్నాయని, చెల్లింపుల బ్యాలెన్స్‌ పరిస్థితి బాగుందన్నారు. రెమిటెన్స్‌లు 27 శాతం పెరిగాయన్నారు. సరుకుల ఎగుమతులు పుంజుకుంటున్నాయని పేర్కొన్నారు. దీంతో వార్షిక లక్ష్యాన్ని 400 బిలియన్‌ డాలర్లు సాధించడం సాధ్యపడుతోందని దాస్‌ పేర్కొన్నారు. చమురు ధరలు గణనీయంగా తగ్గితే.. ఇతర వస్తువుల ధరలు, ద్రవ్యోల్బణం తగ్గడానికి దారితీయడం ద్వారా ఆర్‌బిఐ పరపతి విధానానికి అనుకూలంగా మారనుందన్నారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రులు భగవత్‌ కరాద్‌, పంకజ్‌ చౌదరి, ఆర్థిక కార్యదర్శి సోమనాథన్‌, దీపమ్‌ సెక్రటరీ తుహిన్‌ కాంత పాండే, రెవెన్యూ కార్యదర్శి సంజరు మల్హోత్రా, ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్‌, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజరు సేథ్‌, బ్యాంకింగ్‌ సెక్రటరీ వివేక్‌ జోషి తదితరులు పాల్గొన్నారు.