భారీ బడ్జెట్‌తో బిగ్‌ స్నేక్‌ కింగ్‌

యెలూరు సురేంద్ర రెడ్డి సమర్పణలో బుద్ధ భగవాన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకంపై వస్తున్న సినిమా ‘బిగ్‌ స్నేక్‌ కింగ్‌’. ఈ సినిమా మార్చి 3న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ కానుంది. ఇందులో భాగంగా ఈ చిత్రట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ ఈనెల 14న గ్రాండ్‌గా జరుగనుంది. చిత్ర సమర్పకుడు యెలూరు సురేంద్రరెడ్డి మాట్లాడుతూ, ‘చైనాలోని ఒక ఆ గ్రామానికి చెందిన లీ కొంతమంది గ్రామస్తులను అక్రమ తవ్వకాల కోసం ఒక గుహ దగ్గరకు తీసుకువెళ్తాడు. అయితే, వారి కారణంగా వందేళ్లుగా నిద్రపోతున్న అతి పెద్ద పాము అనూహ్యంగా నిద్ర లేస్తుంది. దాని నుంచి తప్పించుకునే సమయంలో లీ మాత్రమే బ్రతికి బయటపడతాడు. కొన్ని రోజుల తర్వాత ఆ పెద్ద పామును తరిమికొట్టడానికి గ్రామ పెద్దలు యాగాలు చేయడం ప్రారంభిస్తారు. అప్పుడు మహారాజు కుమారుడు చెంగ్‌ ఆ గ్రామానికి వచ్చి వారికి సహాయం చేస్తాడు. లీ కుమార్తె మింగ్‌ యు కూడా అతనితో కలిసి పెద్ద పామును గ్రామస్తుల నుండి దూరంగా మళ్లించి డైనమైట్‌తో చంపేస్తారు. చివరగా, భూమిపై ఏ ప్రాణికి హాని చేయకూడదని గ్రామస్తులందరూ ప్రతిజ్ఞ చేస్తారు. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన చిత్రమిది. ఈచిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది’ అని తెలిపారు.