మహిళలు, పురుషులు సమానం

– ద.మ.రైల్వే సెమినార్‌లో ఏజీఎమ్‌ పీ ఉదరుకుమార్‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సమాజంలో మహిళలు, పురుషులు సమానమేనని దక్షిణ మధ్య రైల్వే అడిషనల్‌ జనరల్‌ మేనేజర్‌ పీ ఉదరుకుమార్‌రెడ్డి అన్నారు. బాధ్యతల్ని సమానంగా పంచుకుంటేనే కుటుంబాలు ఉన్నతంగా తీర్చిదిద్దబడతాయని చెప్పారు. మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్‌ రైల్‌ నిలయంలో ‘మహిళల ఆరోగ్యం-రక్షణ’ అంశంపై జరిగిన సదస్సులో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు. సమాజంలో మహిళలకు గుర్తింపు, గౌరవం, ప్రోత్సాహం ఇవ్వాలనీ, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా పురుషుల ప్రవర్తన ఉండాలని చెప్పారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం సుభిక్షంగా ఉంటుందన్నారు. వర్కింగ్‌ ఉమెన్స్‌కు ఆరోగ్యంపై మరింత అవగాహక కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. దక్షిణ మధ్య రైల్వే మహిళా సంక్షేమ సంఘం ఉపాధ్యక్షురాలు శ్రీలత మాట్లాడుతూ సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పారు. మహిళలకు శారీరక దృఢత్వం అవసరమన్నారు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌కు చెందిన డాక్టర్‌ మోనికా, డాక్టర్‌ సిల్వియా ఫెర్నాండెజ్‌రావు మాట్లాడుతూ వ్యాధులను సకాలంలో గుర్తించడం, నివారణ, చికిత్స, పరిసరాల పరిశుభ్రత, క్రమం తప్పని ఆరోగ్య పరీక్షల ప్రాధాన్యత, మానసిక క్షేమం వంటి పలు విషయాలను వివరించారు.