మహిళల్లో స్ఫూర్తి నింపే చిత్రం

ప్రియాంక ఉపేంద్ర నటించిన తాజా చిత్రం ‘డిటెక్టీవ్‌ తీక్షణ’. ఇది ఆమె నటిస్తున్న 50వ చిత్రం కావడం విశేషం. ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ రఘు దర్శకత్వం వహిస్తుండగా, గుత్తముని ప్రసన్న, జి ముని వెంకట్‌ చరణ్‌ (ఈవెంట్‌ లింక్స్‌, బెంగళూర్‌), పురుషోత్తం బి (ఎస్‌డిసి) నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నాయిక ప్రియాంక ఉపేంద్ర మాట్లాడుతూ, ’20 సంవత్సరాలకు పైగా సుదీర్ఘమైన కెరీర్‌ దక్కినందుకు నేను అదష్టవంతురాలిని. బెంగాలీ, హిందీ, తెలుగు, తమిళ్‌, కన్నడ, ఒడియా భాషల్లో ఎన్నో చిత్రాలు నటించాను. చాలా పెద్ద స్టార్స్‌తో సినిమాలు చేశాను. ఇది నా 50వ సినిమా. దర్శకుడు రఘు చాలా హార్డ్‌ వర్కింగ్‌ అండ్‌ ప్యాషనేట్‌. ఆయన ఈ సినిమా వన్‌ లైన్‌ చెప్పినప్పుడే నేను ఇంప్రెస్‌ అయిపోయాను. ఎందుకంటే ఇలాంటి ప్రధాన పాత్రని ఇంతక ముందు ఎప్పుడూ ఒక మహిళ చేయలేదు. ‘బ్యోంకేష్‌ బక్షి, నాన్సీ డ్రూ’ లాంటి సినిమాలు నాకు గుర్తొచ్చాయి. అలాగే ఇదొక స్ట్రాంగ్‌, ఇంటెలిజెంట్‌, బ్రేవ్‌ ఉమన్‌ కథ. ఈ చిత్రం తప్పకుండా ఆడవాళ్ళని ఇన్స్పైర్‌ చేస్తుంది. ముఖ్యంగా ఆడపిల్లల్ని. ఇప్పటివరకు సూపర్‌ హీరో పాత్రలో మగవారిని చూసిన వాళ్లు ఇప్పుడు మొట్టమొదటిసారి ఒక ఫిమేల్‌ సూపర్‌ హీరోని చూడబోతున్నారు. ఇది వారి మీద బలమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఆడవారు కూడా పవర్‌ ఫుల్‌గా, ఇంటెలిజెంట్‌గా ఉండగలరని, ఒక క్రైమ్‌ని సాల్వ్‌ చేయగలరని వారికి అర్థమయ్యేలా చేస్తుందీ చిత్రం’ అని తెలిపారు.