మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ అరెస్టు

– జమ్మూ కాశ్మీర్‌లో కూల్చివేతలకు వ్యతిరేకంగా ఢిల్లీ విజయ్‌ చౌక్‌ వద్ద ఆందోళన..
న్యూఢిలీ:
మాజీ సీఎం, పీడీపీ నేత మెహబూబా ముఫ్తీని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జమ్మూ కాశ్మీర్‌లోని కూల్చివేతలకు వ్యతిరేకంగా బుధవారం విజయ్‌ చౌక్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు. బీజేపీకి వ్యతిరేకంగా పీడీపీ నేతలు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అయితే అనుమతి లేకుండా ఆందోళనకు పూనుకోవడంతో మెహబూబా ముఫ్తీతోపాటు పలువురు పీడీపీ కార్యకర్తలను కూడా ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు..జమ్మూ కాశ్మీర్‌లో గూండా ప్రభుత్వం నడుస్తున్నదని మెహబూబా ముఫ్తీ నిరసన వ్యక్తం చేశారు. కాశ్మీర్‌ను ఆఫ్ఘనిస్తాన్‌లా నాశనం చేస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. జమ్మూ కాశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో రెండు రోజులుగా చేపడుతున్న కూల్చివేతలను నిరసిస్తూ ఢిల్లీ విజరుచౌక్‌లో ఆందోళనకు దిగారు. 20 జిల్లాల్లో స్థలాలు ఆక్రమించారంటూ అక్కడి అధికారులు కూల్చివేతలకు దిగడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ భూమిని కాపాడేందుకు ఇప్పటివరకు అనేక భవనాలను కూల్చివేయడంతో అమాయక ముస్లిం పేదలు రోడ్డున పడ్డారని ఆమె విచారం వ్యక్తం చేశారు.
కూల్చివేతలు జరుపుతుండగా స్థానికులు రెవెన్యూ అధికారులపై రాళ్లతో దాడి చేశారు. పలు ప్రాంతాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిగాయి. ఆక్రమణల పేరుతో ముస్లింలను వేధించడం ఆపాలని వారు డిమాండ్‌ చేశారు. మంగళవారం ఓ షోరూంను కూల్చివేస్తుండగా రాళ్లతో దాడిచేయగా.. షోరూం యజమానితో పాటు ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాళ్ల దాడిలో ఇప్పటివరకు ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. పరిస్థితి విషమించడంతో జమ్మూ పోలీసులు ప్రజలను అదుపు చేసేందుకు టియర్‌ గ్యాస్‌ షెల్స్‌ ప్రయోగించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొన్నది.