మార్చి 8 నుండి ఆరోగ్య మహిళ

–  ఎనిమిది రకాల ఆరోగ్య సమస్యలకు వైద్యం
–  మొదటి దశలో 100 ఆరోగ్య కేంద్రాల్లో సేవలు
–  భవిష్యత్తులో 1,200ల కేంద్రాలకు విస్తరణ: హరీశ్‌ రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మహిళా దినోత్సవం (మార్చి 8) నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎనిమిది రకాల సమస్యలకు వైద్యం అందించనుంది. మొదటి దశలో 100 ఆరోగ్య కేంద్రాల్లో సేవలను ప్రారంభించి భవిష్యత్తులో 1,200 కేంద్రాలకు విస్తరింపజేస్తుంది. బుధవారం మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ప్రభుత్వ కానుకగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. శనివారం హైదరాబాద్‌ బీఆర్‌కె భవన్‌ నుంచి ఆయన కంటి వెలుగు, సీపీఆర్‌, ప్రత్యామ్నాయ మహిళా ఆరోగ్య కార్యక్రమాలపై పంచాయతీ, మున్సిపల్‌ తదితర శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు తదితరులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల సమగ్ర ఆరోగ్య పరిరక్షణ కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ‘మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, ఇతర సాధారణ పరీక్షలు, ఓరల్‌, సర్వైకల్‌, రొమ్ము క్యాన్సర్ల స్క్రీనింగ్‌, థైరాయిడ్‌ పరీక్ష, సూక్ష్మ పోషకాల లోపాలను గుర్తించడం, అయోడిన్‌ సమస్య, ఫోలిక్‌ యాసిడ్‌, ఐరన్‌ లోపంతో పాటు, విటమిన్‌ బీ12, విటమిన్‌ డి పరీక్షలు చేసి చికిత్స, మందులు అందజేస్తారు. మూత్రకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు, పెల్విక్‌ ఇన్ఫ్లమేటరీ వ్యాధుల పరీక్షలు చేస్తారు. మెనోపాజ్‌ దశకు సంబంధించి పరీక్షల అనంతరం అవసరమైన వారికి హార్మోన్‌ రీప్లేస్మెంట్‌ థెరపీ చేయడంతోపాటు కౌన్సిలింగ్‌తో అవగాహన కలిగిస్తారు. నెలసరి సమస్యలపై పరీక్షలు చేసి వైద్యం అందిస్తారు. సంతాన సమస్యలపై ప్రత్యేకంగా పరీక్షలు చేసి అవగాహన కలిగించడం, అవసరమైనవారికి ఆల్ట్రాసౌండ్‌ పరీక్షలు చేస్తారు. సెక్స్‌ సంబంధిత అంటువ్యాధుల పరీక్షలు చేసి అవగాహన కలిగిస్తారు. అవసరమైన వారికి వైద్యం అందిస్తారు. బరువు నియంత్రణ, యోగా, వ్యాయామం వంటివాటిపై అవగాహన కలిగిస్తారు. ఉచితంగా నిర్వహించే అన్ని రకాల వైద్య పరీక్షలు, ప్రత్యేక యాప్‌ ద్వారా మానిటరింగ్‌ ఉంటుంది. తెలంగాణ డయాగ్నొస్టిక్‌ ద్వారా 57 రకాల వైద్య పరీక్షలు చేస్తారు. రెఫరల్‌ సెంటర్లుగా ప్రభుత్వ పెద్దాస్పత్రులుంటాయి. సంబంధిత మహిళకు పూర్తిగా నయం అయ్యే వరకు వైద్య సేవలు అందించే కార్యక్రమం ఇది. రెఫరల్‌ ఆస్పత్రుల్లో మహిళలకు సేవలు పొందేందుకు వీలుగా ప్రత్యేక హెల్ప్‌ డెస్క్‌ ఉంటాయి….’ అని మంత్రి వివరించారు. ‘అన్ని జిల్లాల్లో విజయవంతంగా నిర్వహించాలనీ, ఈ ప్రత్యేక సేవల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలనీ, మార్చి 8 రోజున ప్రారంభించే కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిదులు పాల్గొనాలనీ. జిల్లా కలెక్టర్లు, డీఎంహెచ్‌ వో చొరవతో పర్యవేక్షించాలనీ, మార్చి 8 రోజున ప్రారంభించే కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిదులు పాల్గొనేలా చూడాలి. జిల్లా కలెక్టర్లు, డీఎంహెచ్‌వో చొరవతో పర్యవేక్షించాలి. జిల్లాల్లో ఎక్కడ ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నామనే వివరాలు ముందుగా ప్రజా ప్రతినిదులు, ప్రజలకు తెలియ చేయాలని ….. ‘ హరీశ్‌ రావు ఆదేశించారు.
10 కేసుల్లో ఒకరే బతుకున్నారు…
అకస్మాత్తుగా వచ్చే కార్డియాక్‌ అరెస్ట్‌ కేసుల్లో 10 మందికిగాను తొమ్మిది మంది మరణిస్తున్నారని మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. దీనికి కార్డియో పల్మనరీ రిససిటేషన్‌ (సీపీఆర్‌)పై అవగాహన లేకపోవడమే కారణమని చెప్పారు. సీపీఆర్‌పై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో జిల్లాకు ఐదు మంది చొప్పున మాస్టర్‌ ట్రైనింగ్‌ ఇచ్చామనీ, వారితో అన్ని విభాగాల వారికి శిక్షణ ఇప్పించాలని సూచించారు. కంటి వెలుగులో రాష్ట్ర సగటు కంటే తక్కువగా జరుగుతున్న జిల్లాల కలెక్టర్లు క్యాంపులను స్వయంగా సందర్శించాలని మంత్రి హరీశ్‌ రావు ఆదేశించారు. కంటి వెలుగు ప్రతి ఒక్కరికి చేరేలా చూడాలని కోరారు. సగటున 14 శాతం మందికి కండ్లద్దాలు అవసరం పడుతున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.