న్యూఢిల్లీ : వరసగా మూడోరోజూ బీబీసీ ఇండియా కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ (ఐటి) సోదాలు కొనసాగాయి. న్యూఢిల్లీ, ముంబయిలోని బిబిసి కార్యాలయాల్లో గురువారం ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. కొంతమంది ఎంపిక చేసిన బీబీసీ సిబ్బందిని అధికారులు ప్రశ్నించి, సంస్థ ఆర్థిక సమాచారాన్ని సేకరించారు. మంగళవారం ఉదయం 11:30 నుంచి బిబిసి కార్యాలయాల్లో ఐటీ శాఖ సోదాలు ప్రారంభమయ్యాయి. ఈ సోదాల గురించి బుధవారం ఐటీ అధికారులు మాట్లాడుతూ ఈ కసరత్తు మరికొంత కాలం పాటు కొనసాగుతుందని వెల్లడించారు. సంస్థ ఆర్థిక లావాదేవీలు, కంపెనీ నిర్మాణం, సంస్థ ఇతర వివరాల కోసం సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం.