మెకిన్సీలో 2వేల మందిపై వేటు

న్యూయార్క్‌:ఆర్థిక మాంద్యం భయాలు టెక్‌ కంపెనీలను గడ గడలాడిస్తున్నాయి. భవిష్యత్తు రోజులు ఎలా ఉంటాయోననే భయాల్లో పొదుపు చర్యలకు దిగుతున్నాయి. ఈ క్రమంలో అనేక టెక్నలాజీ కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా గ్లోబల్‌ కన్సల్టెంగ్‌ సంస్థ మెకిన్సీ ఏకంగా 2,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతుందని బుధవారం బ్లూమ్‌బర్గ్‌ వెల్లడించింది. మెకిన్సీలో ప్రపంచ వ్యాప్తంగా 45వేల మంది పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. తొలుత క్లయింట్స్‌తో నేరుగా సంబంధాలు లేని ఉద్యోగులపై వేటు వేయనుందని తెలుస్తోంది. 100 ఏండ్ల క్రితం చికాగోలో ఏర్పాటైన ఈ కంపెనీ ప్రస్తుతం 130 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తుంది. వచ్చే రెండు వారాల్లో తొలగింపులపై ఆ కంపెనీ అధికారికంగా ప్రకటన చేయనుందని బ్లూమ్‌బర్గ్‌ పేర్కొంది. అమెరికా ఆర్థిక వ్యవస్థలో రోజు రోజుకు మాంద్యం చాయలు పెరగడంతో ఇప్పటికే ట్విట్టర్‌, మెటా, అమెజాన్‌, గూగుల్‌, గోల్డ్‌మాన్‌ సాక్స్‌, మోర్గాన్‌ స్టాన్లీ తదితర కంపెనీలు వేల సంఖ్యలో తమ ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి. టెక్‌, ఫైనాన్స్‌, రిటైల్‌ తదితర అన్ని రంగాల్లో కోతలు చోటు చేసుకుంటున్నాయి.