మేడారంలో వేసిన ఈ అడుగు.. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కడానికే..

– టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి
– ప్రారంభమైన ‘హాత్‌ సే హాత్‌’ పాదయాత్ర
– పేదలకు బతుకుదెరువు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్‌ : ఎమ్మెల్యే సీతక్క
నవతెలంగాణ- తాడ్వాయి/ములుగు
మేడారంలో వేసిన ఈ అడుగు కేసీఆర్‌ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కడానికే అని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో పాదయాత్రకు కొనసాగింపుగా టీపీసీసీ చేపడుతున్న ‘హాత్‌ సే హాత్‌’ జోడో పాదయాత్రలో సోమవారం ములుగు నియోజకవర్గం నుంచి ప్రారంభించారు. ములుగు చేరుకున్న రేవంత్‌ రెడ్డి ముందుగా ములుగు గట్టమ్మ తల్లి దేవాలయంలో పూజలు చేశారు. సమ్మక్క-సారలమ్మల ఆశ్వీరాదం కోసం వచ్చే భక్తులంతా తొలుత ఇక్కడ పూజలు చేసి మేడారం వెళ్లడం అనవాయితీ. అనంతరం మేడారంలో సమ్మక్క-సారలమ్మలకు ప్రత్యేక పూజలు చేసి వనదేవతల ఆశీర్వాదం తీసుకొని అక్కడే నుంచే హాత్‌ సే హాత్‌ జోడో పాదయాత్రను లాంఛనంగా ప్రారంభించారు. మేడారం నుంచి మొదలైన పాదయాత్ర ప్రాజెక్టు నగర్‌ వరకు సాగింది. అక్కడ కొంతసేపు విరామం తీసుకున్న అనంతరం ప్రాజెక్టు నగర్‌ నుంచి పస్రా గ్రామానికి పాదయాత్ర చేరుకుంది. మార్గమధ్యలో పుట్టాపూర్‌ గ్రామానికి చెందిన మహిళా వ్యవసాయ కూలీలు రేవంత్‌ రెడ్డిని కలిశారు. వారి సమస్యలను అడిగి తెలిసుకున్నారు రేవంత్‌ రెడ్డి. పస్రా కార్నర్‌ మీటింగ్‌ తర్వాత పాదయాత్ర రామప్ప గ్రామం వరకు కొనసాగింది. రాత్రి ఆ గ్రామంలోనే బస చేయనున్నారు. పస్రా గ్రామంలో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ములుగు నుంచి సీతక్కను ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. ములుగు ఖ్యాతిని ఢిల్లీ వరకు తీసుకెళ్లారని కొనియాడారు. కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి బీజేపీ అధికారాన్ని పదిలం చేసుకోవాలనుకుంటోందని విమర్శించారు. త్యాగాల పునాదులపై కాంగ్రెస్‌ పార్టీ ఏర్పడిందని, అందుకే ప్రాణాలకు తెగించి దేశ సమగ్రతను కాపాడేందుకు రాహుల్‌ గాంధీ పాదయాత్ర చేశారని తెలిపారు. ఆ స్ఫూర్తితో ‘హాత్‌ సే హాత్‌’ యాత్ర నిర్వహించాలని ఏఐసీసీ ఆదేశించిందన్నారు. కాగా, సమ్మక్క సారలమ్మ వన దేవతలు.. నమ్మిన ప్రజల కోసం కాకతీయ సామ్రాజ్యాన్ని ఎదిరించి చివరి రక్తపు బొట్టు వరకు పోరాడిన సమ్మక్క సారలమ్మల స్ఫూర్తితో ఈ యాత్రను ప్రారంభించినట్టు తెలిపారు. సాయుధ రైతాంగ పోరాటంలో నైజాం సర్కారును గడగడలాడించిన గడ్డ మీద ఆ అమ్మల ఆశీర్వాదంతో పోరాటానికి సిద్ధమయ్యామని స్పష్టంచేశారు. సమ్మక్క సారక్క సాక్షిగా సీతక్క హారతి ఇచ్చి స్వాగతం పలికిందంటే.. ఈ యాత్ర విజయవంతం అయినట్టేనని తెలిపారు. అమరుల త్యాగాలను ఈ ప్రభుత్వం మట్టి కప్పి, అధికారం అడ్డుపెట్టుకుని కేసీఆర్‌ ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుల బాధతో రైతులు పురుగుల మందు తాగి చనిపోవడం సంక్షేమమా అని, నోటిఫికేషన్ల లేక, ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడం సంక్షేమమా అని.
విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వకుండా పేదలను విద్యకు దూరం చేయడం సంక్షేమమా అని ప్రశ్నించారు. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ ఏమయిందన్నారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ. 25 లక్షల కోట్ల బడ్జెట్‌ ప్రవేశపెట్టారని, ఆ లెక్కన ప్రతి నియోజకవర్గానికి రూ. 20 వేల కోట్లు రావాలని, ములుగుకు రూ. 20 వేల కోట్లు వచ్చాయా అని అడిగారు. కేసీఆర్‌ను గద్దె దింపితేనే రాష్ట్రంలో మార్పు వస్తుందని, అందుకే యాత్ర చేపట్టినట్టు తెలిపారు.
రేవంత్‌ వస్తున్నారని
రాత్రికి రాత్రే పట్టాలు: సీతక్క
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి వస్తున్నాడని తెలిసి పోడు భూములకు పట్టాలు ఇస్తామని రాత్రికి రాత్రి చాటింపు వేశారని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. కాంగ్రెస్‌ అంటేనే లక్షలాది ఎకరాలు పేదలకు పంచిన పార్టీ అని, అలాంటి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే వరకు చేతిలో చేయి వేసి.. అడుగులో అడుగేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
రేవంత్‌ రెడ్డి యాత్ర పిలుపుతో ఇంత మంది తరలిరావడం చూస్తుంటే.. కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలని మీలో ఎంత ఉత్సాహం ఉందో అర్ధమవుతోందన్నారు. పేదింటి బిడ్డనైన తనని అక్కున చేర్చుకున్నారని.. మూడు తరాలతో అక్కా అని అప్యాయంగా పిలిపించుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. మేడారం వనదేవతల ఆలయం నుంచి రేవంత్‌ రెడ్డి యాత్రను ప్రారంభించడం సంతోషంగా ఉందని సీతక్క అన్నారు. ఈ యాత్రలో ఏఐసీసీ ఇన్‌చార్జ్‌ మాణిక్‌ రావ్‌ ఠాక్రే, ప్రచార కమిటీ చైర్మెన్‌ మధు యాష్కీ, షబ్బీర్‌ అలీ, పీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి, కొండా మురళి, తదితరులు పాల్గొన్నారు.