మేథోసంపత్తిలో అట్టడుగున భారత్‌

–  55 దేశాల్లో 42వ ర్యాంక్‌
–  ఐపీ హక్కుల పరిరక్షణ మెరుగుపడాలి : నివేదిక
న్యూఢిల్లీ : మేథో సంపత్తి (ఐపీ) హక్కుల సూచికలో భారత్‌ చాలా వెనుకపడింది. 2023 ఏడాదికి సంబంధించి మొత్తం 55 దేశాలకు ర్యాంకులు విడుదల చేయగా, భారత్‌కు 42వ స్థానం దక్కింది. భారత్‌ సహా అనేక దేశాల్లో మేథో సంపత్తి హక్కులకు సవాళ్లు నెలకొన్నాయని తాజా నివేదిక పేర్కొంది. అమెరికా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతిఏటా ఈ నివేదికను విడుదల చేస్తోంది. ఈ ఏడాది 55 దేశాలకు ర్యాంకులు విడుదల చేయగా, భారత్‌ స్థానం (2021లో) 40 నుంచి 42కు పడిపోయింది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా గుర్తింపు అందుకున్న ఈ 55 దేశాల జీడీపీ, ప్రపంచ జీడీపీలో 90శాతం వాటాను కలిగివున్నాయి. పేటెంట్‌, కాపీరైట్‌ చట్టాల అమలు, మేథో సంపత్తి హక్కుల పరిరక్షణ, అంతర్జాతీయ ఒప్పందాలకు ఆమోదం తెలపటం వంటివి ఆయా దేశాల్లో ఏ విధంగా ఉందన్నది వెలుగులోకి తీసుకురావటం ఈ నివేదిక ముఖ్య ఉద్దేశం. భారత్‌ సహా అనేక దేశాల్లో మేథో సంపత్తి హక్కులకు భంగం వాటిల్లే విధానాలు తెరపైకి వస్తున్నాయని, ఇవన్నీ ఐపీ హక్కుల్ని తుడిచిపెట్టే ప్రమాదముందని నివేదికలో ఆందోళన వ్యక్తమైంది. నూతన ఆవిష్కరణలు, సృజనాత్మకత, పోటీ తత్వం..ఇవన్నీ ఆయా దేశాల ఆర్థిక భవిష్యత్తును ప్రకాశవంతం చేస్తుందని నివేదిక తెలిపింది. ఈ నివేదికపై అమెరికా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ప్యాట్రిక్‌ కిల్‌బ్రిడ్‌ మాట్లాడుతూ, ”జనాభా, భౌగోళికంగా భారత్‌ పెద్ద దేశం. ఆర్థిక వ్యవస్థా పెద్దదే. ప్రపంచ వేదికపై భారత్‌ ప్రభావం ఉంది. ఇవన్నీ కూడా వర్ధమాన దేశంగా భారత్‌కు కలిసివచ్చే అంశాలు. ఐపీ హక్కులకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మేంట్‌ వ్యవస్థ మెరుగుపడింది. అయితే ఆసియాలో భారత్‌ ప్రత్యేక నిలబడాలన్నా, ఆర్థిక వృద్ధి కొనసాగించా లన్నా..అది సరిపోదు” అని అన్నారు.