మొగల్‌ గార్డెన్‌ పేరును అమృత్‌ ఉద్యాన్‌గా మార్చటం సమంజసం కాదు : ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
దేశ రాజధాని న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో గల మొగల్‌ గార్డెన్‌ పేరును అమృత్‌ ఉద్యాన్‌గా మార్చటం సమంజసం, సమర్ధనీయం కాదని ఎమ్మెల్యే అలుగుబెల్లి నర్సిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మొగల్‌ గార్డెన్‌ పేరునే కొనసాగించాలని కేంద్రాన్ని కోరారు. ఆ పేరు మార్చటం వల్ల భారతీయ సమాజానికి జరిగేమేలు లేశమాత్రమైనా లేదని తెలిపారు. దేశ ప్రజల్లో విభజన పెరగటానికి ఇలాంటి చర్యలు దారితీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త నిర్మాణాలకు పాలకులు తమకు అనుకూలమైన పేరు పెట్టుకోవటాన్ని అర్థం చేసుకోవచ్చునని తెలిపారు. కానీ, 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో అవసరం రాని పేరు మార్పిడి ఇప్పుడెందుకు అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు పౌరులందరికీ బాధ్యత వహించే విధంగా ఉండాలని సూచించారు. ప్రజల మధ్య విభజన రేఖ తీసుకొచ్చే ఇలాంటి చర్యలకు స్వస్తి పలకాలని విజ్ఞప్తి చేశారు.