మోడీ మెదడులోనే అవినీతి మూలాలు

– జేపీసీ వేయాలంటూ నేడు ఎస్‌బీఐ, ఎల్‌ఐసీ, ఆర్‌బీఐ వద్ద ధర్నాలు : సీపీఐ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
దేశంలో జరుగుతున్న అవినీతి మూలాలు ప్రధాని నరేంద్ర మోడీ మెదడులోనే పురుడుపోసుకుం టున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. అదానీ సంస్థ షేర్లు కుప్పకూలిపోవడంతో ఎల్‌ఐసీకి రూ.40 వేల కోట్లు, ఎస్‌బీఐకి రూ.తొమ్మిది వేల కోట్లు, ఇతర బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇది దేశంలో జరిగిన కుంభకోణమే కాదంటూ దాని ప్రస్తావనే తీసుకురాకుండా ప్రతిపక్షాల మీద మోడీ ఎదురుదాడికి పూనుకుంటున్నారని పేర్కొన్నారు. ఇది దేశ ప్రజలపై దాడి చేయడమేనని తెలిపారు. జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని వేయాలంటూ దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు, ఎల్‌ఐసీ, ఆర్‌బీఐ ముందు సోమవారం పెద్దఎత్తున ధర్నాలు నిర్వహిస్తున్నామని వివరించారు. అదానీ సంస్థలపై తక్షణమే చర్యలకు ఆదేశించాలనీ, అలాంటి అవినీతిపరులను నియంత్రణలోకి తీసుకోవాలనీ, ప్రభుత్వరంగ సంస్థలను కాపాడాలని డిమాండ్‌ చేశారు.