యాంటీ లవ్‌స్టోరీ షురూ

రామ్‌ కార్తీక్‌, ప్రిష జంటగా రూపొందుతున్న చిత్రం ‘ఔను.. నేనింతే’. ఎం.ఎ.సత్తార్‌ సమర్పణలో శ్రీ సత్య విధుర మూవీస్‌ పతాకంపై డి.వి.కెనాగేశ్వరరావు దర్శకత్వంలో జి.వి.చౌదరి, నాగరాజు చిర్రా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ చిత్ర పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నటులు పృథ్వీ క్లాప్‌ కొట్టగా, అనీష్‌ కురువెళ్ల కెమెరా స్విచాన్‌ చేశారు. చిత్ర సమర్పకులు ఎం.ఎ. సత్తార్‌ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నిర్మాతలు జి.వి.చౌదరి, నాగరాజు చిర్రా మాట్లాడుతూ,’ఖర్చుకు వెనుకాడకుండా ఈ సినిమాని నిర్మిస్తున్నాం. ప్రతి ఒక్కరినీ ఆలోచింప జేసే విధంగా రూపొందనున్న మా చిత్రానికి చక్కటి నటీనటులు, టెక్నీషియన్స్‌ కుదిరారు’ అని అన్నారు. ‘ఇదొక యాంటీ లవ్‌స్టోరీ. రివర్స్‌ స్క్రీన్‌ ప్లేతో రాసుకున్న కథ. క్షణక్షణం అడ్వాన్స్‌ అయిపోతున్న ప్రస్తుత ట్రెండ్‌లో యూత్‌ కూడా ఇంకా అడ్వాన్స్డ్‌గా ఉంటున్నారు. దీంతో వారు చేసే పనుల వలన వారి జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారు అనే విషయాన్ని ప్రతి ఒక్కరికీ అర్థమయ్యే విధంగా అండర్‌ కరెంట్‌ మెసేజ్‌ ఇస్తూ అవుట్‌ అవుట్‌ కామెడీతో చూపించబోతున్నాం’ అని దర్శకుడు నాగేశ్వరరావు చెప్పారు. ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ అలవలపాటి శేఖర్‌ మాట్లాడుతూ,’మంచి కథతో వస్తున్న ఈ సినిమాకి తగ్గట్టే రఘు కుంచె చక్కటి పాటలు అందిస్తున్నారు. మంచి టీమ్‌, మంచి కంటెంట్‌ ఉన్న కథతో వస్తున్న ఈ సినిమా బిగ్‌ హిట్‌ అవ్వాలని కోరుతున్నాను’ అని అన్నారు.