యువతను మోసం చేసిన మోడీ

–  డీవైఎఫ్‌ఐ మహిళా సమ్మేళనంలో బృందాకరత్‌
న్యూఢిల్లీ : దేశంలో యువతను ప్రధాని మోడీ మోసం చేశారని సీపీఐ(ఎం) పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌ విమర్శించారు. శనివారం నాడిక్కడ హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌ భవన్‌లో రెండు రోజుల డీవైఎఫ్‌ఐ అఖిల భారత మహిళా సమ్మేళనం ప్రారంభమైంది. సమ్మేళనం ప్రారంభానికి ముందు డీవైఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఎఎ రహీం సంఘం జెండాను ఆవిష్కరించారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ప్రధాన కార్యదర్శి మరియం ధావలే సదస్సును ప్రారంభించారు. మహిళలు లింగ ప్రాతిపదికన, కార్మికులుగా, పౌరులుగా మూడు రకాలుగా దోపిడీకి గురవుతున్నారని తెలిపారు. లింగ సమస్య కూడా వర్గ దోపిడికి సంబంధించిన సమస్య అని అన్నారు. సంస్కృతిని కాపాడతామని చెబుతూ సంఫ్‌ు పరివార్‌ మహిళలపై పితృస్వామ్యాన్ని ప్రయోగిస్తున్నదని విమర్శించారు. దాన్ని వ్యతిరేకించే వారిని దేశ వ్యతిరేకులుగా చిత్రీకరిస్తున్నదని దుయ్యబట్టారు. డీవైఎఫ్‌ఐ అఖిల భారత ప్రధాన కార్యదర్శి హిమగరాజ్‌ భట్టాచార్య నివేదికను సమర్పించారు. అనంతరం జరిగిన చర్చల్లో ప్రతినిధులు పాల్గొన్నారు. మధ్యాహ్నం జరిగిన సెషన్‌ సీపీఐ(ఎం) పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌ ప్రసంగించారు. మోడీ సర్కార్‌ యువతకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేస్తున్నదని తెలిపారు. మోడీ హయాంలో యువత, మరీముఖ్యంగా యువతులు సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా హిజాబ్‌ అంశాన్ని ఉటంకించారు. ఈ కన్వెన్షన్‌లో వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు.