రాష్ట్రాన్ని క్రీడల హబ్‌గా మారుస్తాం

–  మంత్రి శ్రీనివాసగౌడ్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రాన్ని క్రీడల హబ్‌గా మారుస్తామని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్‌ వి.శ్రీనివాస్‌గౌడ్‌ చెప్పారు. హైదరాబాద్‌ రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో ప్రముఖ బ్యాడ్మింటన్‌ యువ కెరటం పంజాల విష్ణువర్ధన్‌గౌడ్‌ బుధవారం మంత్రిని మర్యాపూర్వకంగా కలిశారు. ఈనెల 14 నుంచి 19 వరకు దుబారులో జరిగిన బ్యాడ్మింటన్‌ ఏషియా కప్‌లో మిక్స్‌డ్‌ టీమ్‌ ఛాంపియన్‌షిప్‌లో విష్ణువర్ధన్‌ టైటిల్‌ సాధించడం పట్ల మంత్రి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుదీర్ఘ విరామం తర్వాత బ్యాడ్మింటన్‌లో ప్రతిష్టాత్మక థామస్‌ కప్‌ను ఇండియా జట్టు విజయం సాధించడంలో విష్ణువర్ధన్‌గౌడ్‌ కీలకపాత్ర పోషించారని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రీడల అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నామన్నారు. హైదరాబాద్‌ నగరం ఇప్పటికే బ్యాడ్మింటన్‌, టెన్నిస్‌, రెజ్లింగ్‌, కబడ్డి, వాలీబాల్‌, బాక్సింగ్‌ లాంటి ఎన్నో క్రీడల్లో హైదరాబాద్‌ క్రీడాకారులు విశేష ప్రతిభను కనబరుస్తూ…జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పథకాలను సాధిస్తున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. క్రీడాకారులను తీర్చిదిద్దడానికి వీలుగా రాష్ట్రంలో క్రీడా పాఠశాల ద్వారా క్రీడా శిక్షణను ఇస్తున్నామని తెలిపారు. త్వరలో జరిగే క్యాబినెట్‌ సబ్‌ కమిటీలో స్పోర్ట్స్‌ పాలసీ ఆమోదానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల కేంద్ర సంఘం కోశాధికారి పుల్లెల రవీందర్‌ కుమార్‌ గౌడ్‌, తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పల్లె లక్ష్మణరావు గౌడ్‌, దేవేందర్‌ గౌడ్‌, సంజరు గౌడ్‌, వెంకట్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.