రూ.50 వేలు జరిమానా

  జేఎన్‌యూలో నిరసనలపై ఉక్కుపాదం
న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో విద్యార్థుల గొంతు నొక్కేందుకు వైస్‌ ఛాన్సెలర్‌ శాంతిశ్రీ కొత్త నిబంధనలను అమల్లోకి తేనున్నారు. ఈ నిబంధన ల ప్రకారం… యూనివర్సిటీలో ఆందోళనలు, ధర్నాలు, నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులకు రూ.50 వేల వరకూ జరిమానా విధిస్తారు. అలాగే జరిమానాతో పాటు ఆ విద్యార్థి అడ్మిషన్‌ను కూడా రద్దు చేస్తూ వైస్‌ ఛాన్సెలర్‌ కొత్త నిబంధనలను తీసుకొచ్చారు. ప్రధాని మోడీపై బీబీసీ రూపొందించిన ‘ద మోడీ క్వశ్చన్‌’ డాక్యుమెంటరీని విద్యార్థి సంఘాలు జేఎన్‌యూలో ప్రదర్శించిన విషయం తెలిసిందే. కాగా, దానికి వ్యతిరేకంగానే వైస్‌ ఛాన్సెలర్‌ ఈ నిబంధనలను అమల్లోకి తెచ్చారని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. తాజాగా కొత్త నిబంధనలు అమల్లోకి రానున్న నేపథ్యంలో జేఎన్‌యూ స్టూడెంట్స్‌ యూనియన్‌ గురువారం అన్ని విద్యార్థి సంఘాల సమావేశాన్ని ఏర్పాటు చేసింది.కాగా, కొత్త నిబంధనలను యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ ఆమోదించినట్టు పత్రాలు పేర్కొన్నాయి. అయితే ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సభ్యుల్లో ఒకరు మీడియాతో మాట్లాడుతూ… ‘ఈ నిబంధనలపై కౌన్సిల్‌లో సరైన చర్చ జరగలేదు’ అన్నారు. దీనిపై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ కార్యదర్శి వికాస్‌ పటేల్‌ మాట్లాడుతూ.. ‘వైస్‌ ఛాన్సెలర్‌ క్రూరమైన ప్రవర్తనా నియమావళిని అమలుచేసేందుకు యత్నిస్తున్నారు. ఇది తుగ్లక్‌ చర్య. విద్యార్థి సంఘాలతో ఎలాంటి చర్చ జరపకుండా నిబంధనలను రూపొందించారు. వీటిని వెనక్కి తీసుకోవాలని మేం డిమాండ్‌ చేస్తున్నాం’ అన్నారు. అయితే ఈ నిబంధనలపై విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయుల నుంచి ఎన్ని విమర్శలు వస్తున్నా.. వైస్‌ ఛాన్సెలర్‌ శాంతిశ్రీ మాత్రం స్పందించటంలేదు. తాజా నిబంధనల్లో యూనివర్సిటీలో జూదం ఆడటం, హాస్టల్‌ గదులను అనధికారికంగా ఆక్రమించడం, వాటిని దుర్వినియోగం చేయడం, అవమానకరమైన పదజాలం ఉపయోగించడం, ఫోర్జరీ చేయడం వంటి 17 నేరాలను, వాటికి శిక్షలను విధిస్తూ కొత్త జాబితాను రూపొందించారు. ఫిర్యాదుల కాపీలను విద్యార్థుల తల్లిదండ్రులకు పంపుతామని నిబంధనల్లో పేర్కొనడం జరిగింది. గతంలో ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులకు రూ. 20 వేల జరిమానా విధించే నిబంధన ఉంది. అయితే, పాత నిబంధనలను మార్పు చేసి.. విద్యార్థులకు విధించే జరిమానాను రూ.50 వేలకు పెంచుతూ వైస్‌ ఛాన్స్‌లర్‌ కొత్త నిబంధనలను తీసుకొచ్చారు.