రేపటి నుంచి మినీ మేడారం జాతర

నవతెలంగాణ -తాడ్వాయి
తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా మేడారం మినీ జాతరకు సమయం ఆసన్నమయ్యింది. ఈ నెల 1వ తేదీ నుంచి 4 వ తేదీ వరకు జరిగే వనదేవతల జాతర కోసంనేపథ్యంలో ఇప్పటికే మేడారం పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. జాతరకు ఇంకా రెండు రోజులే గడువు ఉండడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లులకు చీర, సారె, ఇచ్చి పసుపు కుంకాలు పెట్టి భక్తులు అమ్మవార్లకు పెద్ద ఎత్తున బంగారం సమర్పించుకుంటున్నారు. జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు అధిక సంఖ్యలో లక్షలలో భక్తులు అమ్మలను దర్శించున్నారు.
భక్తుల పుణ్యసాన్నాలతో జంపన్న వాగు కళకళలాడుతోంది. భక్తులంతా సమ్మక్క సారలమ్మ గద్దెల వద్దకు చేరుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. చాలా మంది తాము మొక్కుకున్నట్లుగా నిలువెత్తు బంగారాన్ని అమ్మవార్లకు సమర్పిస్తున్నారు. పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో పూజారులు, ఎండోమెంట్ ఈవో రాజేంద్రం ఆధ్వర్యంలో ఎండోమెంట్ సిబ్బంది భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. మొక్కులు చెల్లించుకున్న అనంతరం సమీపంలోని అడవి ప్రాంతంలో విడిది చేసి, వంట వార్పు చేసుకుని భోజనాలు ఆరగించిన అనంతరం తిరుగు ప్రయాణం చేస్తున్నారు.