లింగాల గ్రామ సమస్యలు పరిష్కరించాలి

– సిపిఎం జిల్లా కార్యదర్శి
– తుమ్మల వెంకట్ రెడ్డి
నవతెలంగాణ-తాడ్వాయి
మండలంలోని లింగాల గ్రామం లోని పలు సమస్యలను పరిష్కరించాలని సిపిఎం పార్టీ ములుగు జిల్లా కార్యదర్శి తుమ్మల వెంక రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని లింగాల గ్రామాన్ని సందర్శించి, పరిశీలించారు. వారి పర్యటనలో అనేక సమస్యలు వెలుగు చూసినాయని అన్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి మాట్లాడుతూ 1995లో లింగాల గ్రామ సమీపంలోని, చెన్నరేవు వాగులో లిఫ్ట్ ఏర్పాటు చేసి గ్రామపంచాయతీలోని ఊరగుంటకు నిరంతరం సాగు నీరందించే ఏర్పాటు చేసినారని, అది అర్ధాంతరంగా ఆగిపోయిందని వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని మరమ్మతులు చేయాలని అన్నారు. దీంతో రెండు గ్రామాల ప్రజలు రెండు పంటలతో సమృద్ధిగా జీవనం గడుపుతారు అన్నారు.
ఇప్పుడు సాగునీరు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ లిఫ్టులో గుట్ట పై భాగంలో నిరంధించాలంటే ఇబ్బందిగా ఉందని, ఇప్పుడున్న లిఫ్ట్ కంటే దిగువన 100 మీటర్ల దూరంలో లిఫ్ట్ ఏర్పాటు చేస్తే లింగాల, బోటిలింగాల గ్రామాల ఆదివాసి రైతులకు సాగునీరు అందించే అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం పోడు సర్వే చేసి కేవలం 34 మందికి మాత్రమే హక్కు పత్రాలు ఇస్తామని పేర్కొన్నారని, శాటిలైట్ ఆధారంగా సర్వే చేయడం వల్ల ఆదివాసి పోడు సాగుదారులకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. జిల్లాలో 15 వేల దరఖాస్తులు రెవెన్యూ భూములకు పెట్టుకున్నారని, ఇది పరిశీలనలో వెళ్లడైందని, ఇలాంటి భూమి లింగాలలో కూడా ఉన్నదని పేర్కొన్నారు. వాస్తవంగా లింగాల గ్రామపంచాయతీలో 106 సర్వే నెంబర్లు మూడు వేలకు పైగా రెవిన్యూ భూమి ఉన్నదని రెవెన్యూ భూమి పట్టాలిస్తే రైతులందరూ కూడా రెవెన్యూ పట్టాలు వస్తాయని పేర్కొన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి సాగునీటి సమస్యను పోడు భూముల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని యెడల ప్రజల సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉకే నాగేశ్వరరావు, జన్ను ఎల్లయ్య, ఉకే ప్రభాకర్, కోరం సారయ్య, ఊకే రాంబాబు, బి సంజీవ రైతులు, సిపిఎం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.