వర్గీకరణపై బీజేపీ నమ్మకద్రోహం

– ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు
మంద కృష్ణ విమర్శ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
పార్లమెంటులో పూర్తి మెజారిటీ ఉన్నా, ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టకపోవడం బీజేపీ చేస్తున్న నమ్మకద్రోహమేనని మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్‌) వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ అన్నారు. తమకు నచ్చిన బిల్లుల్ని సునాయాసంగా ఆమోదించుకుంటున్న కేంద్రప్రభుత్వం వర్గీకరణ బిల్లుపై ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నదో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇది రాజకీయ దిగజారుడుతనమని విమర్శించారు. కర్ణాటకలో జస్టిస్‌ సదాశివన్‌ కమిషన్‌ నివేదిక అమలు చేయడంలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని చెప్పారు. బెంగుళూరు అంబేద్కర్‌ భవన్‌లో బుధవారం జరిగిన ఎమ్మార్పీఎస్‌ జాతీయ సదస్సులో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని, ప్రసంగించారు. వచ్చే పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో వర్గీకరణ డిమాండ్‌ ఉన్న రాష్ట్రాల్లో బీజేపీని రాజకీయంగా భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. భవిష్యత్‌ పోరాటాలకు మాదిగలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్‌ జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ మున్నంగి నాగరాజు మాదిగ అధ్యక్షత వహించారు. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాఖల అధ్యక్షులు నర్సప్ప మాదిగ, గోవింద్‌ నరేష్‌ మాదిగ, రుద్రపోగు సురేష్‌మాదిగ, పాండిచ్చేరి, తమిళనాడు కన్వీనర్లు శేషయ్య మాదిగ, లోకేష్‌ మాదిగ తదితరులు పాల్గొన్నారు.