వార్‌రూం దర్యాప్తుపై స్టే

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కాంగ్రెస్‌ వార్‌ రూంపై పోలీసుల దాడి కేసులో నిందితులు ముగ్గురికి సీఆర్‌పీసీ 41ఏ కింద జారీ చేసిన నోటీసులపై హైకోర్టు స్టే విధించింది. మహిళల ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాదాపూర్‌లోని వార్‌ రూంపై దాడి చేశారు. అక్కడ పని చేసే ఇషాన్‌ శర్మ, తాతినేని శశాంక్‌, ఎం.ప్రతాప్‌లపై కేసు నమోదు చేశారు. వారికి పోలీసులు ఇచ్చిన (సీఆర్‌పీసీ 41ఏ కింద) నోటీసులను సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని బుధవారం జస్టిస్‌ సురేందర్‌ విచారణ జరిపారు. పోలీసుల కేసు, 41ఎ నోటీసులపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణను ఈ నెల 23కి వాయిదా వేశారు. పోలీసుల నోటీసులను కొట్టివేయాలనీ, పిటిషనర్లు ముగ్గురినీ దాదాపు 18 గంటల పాటు అక్రమ నిర్బంధంలో ఉంచారని వాకి తరఫున సీనియర్‌ లాయర్‌ సీవీ మోహన్‌రెడ్డి వాదించారు. ఎమ్మెల్యేల ఎర కేసులో తరహాలోనే ఇక్కడ కూడా పోలీసులు చేశారన్నారు. పోలీసుల తరఫున న్యాయవాది ప్రతాప్‌రెడ్డి వాదిస్తూ పిటిషనర్లు ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా ఉన్నారని చెప్పారు. పంచనామాపై వాళ్ల సంతకాలు తీసుకున్నట్లు చెప్పారు. స్టే ఇచ్చిన హైకోర్టు విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది.
రూ.50 వేలు జరిమానా
బ్యాంకు రుణం చెల్లించని వాళ్లకు యూకో బ్యాంక్‌ జారీ చేసిన లుక్‌ అవుట్‌ నోటీసును సింగిల్‌ జడ్జి నిలిపివేయడాన్ని సవాల్‌ చేస్తూ ఆ బ్యాంక్‌ అప్పీల్‌ చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. సింగిల్‌ జడ్జి తీర్పుపై గడువు ముగిసిన తర్వాత అప్పీల్‌ చేయడానికి కారణమైన బ్యాంక్‌ రీజనల్‌ మేనేజర్‌ సందీప్‌ శర్మకు రూ.50 వేలు జరిమానా విధించింది. ఈ మేరకు చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ నేత ృత్వంలోని డివిజన్‌ బెంచ్‌ తీర్పు వెలువరించింది. బ్యాంక్‌ రుణం రూ.75 లక్షలు తీసుకుని చెల్లించలేదంటూ ఇచ్చిన లుక్‌ఔట్‌ నోటీసును మాగంటి వెంకట రమణారావు, ఆయన భార్య ఉషారాణి హైకోర్టులో సవాల్‌ చేశారు. వాళ్లపై క్రిమినల్‌ కేసులు లేనందున లుక్‌ఔట్‌ నోటీసుపై సింగిల్‌ జడ్జి స్టే విధించారు. విదేశాలు వెళ్లేందుకు అనుమతిచ్చారు. దీనిపై బ్యాంక్‌ ఆలస్యంగా అప్పీల్‌ చేయడంపై బెంచ్‌ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సింగిల్‌ జడ్జి తీర్పు సముచితంగానే ఉన్నందున అప్పీల్‌ను డిస్మిస్‌ చేస్తున్నట్టు తెలిపింది.