విద్యుత్‌ కోతలపై అన్నదాతల ఆగ్రహం

– పైర్లు ఎండిపోతున్నాయని ఆవేదన
– సబ్‌స్టేషన్ల వద్ద ధర్నా
– గతంలో మాదిరిగానే సరఫరా చేయాలని డిమాండ్‌
నవతెలంగాణ-పెద్దవూర/ నారాయణపేట టౌన్‌/ నంగునూరు
వ్యవసాయానికి వచ్చే త్రీఫేజ్‌ విద్యుత్‌ సరఫరాలో కోతలపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా ఆందోళన చేస్తున్నా ప్రభు త్వం నుంచి స్పందన లేకపో వడంతో శుక్రవారం కూడా పలు జిల్లాల్లో సబ్‌స్టేషన్ల ఎదుట ధర్నా చేశారు. కొద్ది రోజుల్లో చేతికం దాల్సిన పంట పొలాలు కరెంట్‌ కోతల వల్ల నీరందక ఎండిపోతు న్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పులిచర్ల గ్రామం లోని సబ్‌ స్టేషన్‌ ఎదుట రైతులు ధర్నా చేశారు. పులిచర్ల, ఉట్లపల్లి, కోమటి కుంట తండా, బాసోని బావి తండా రైతులు ధర్నాలో పాల్గొ న్నారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ.. వ్యవసా యానికి 24 గంటలపాటు నిరంత రాయంగా నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేస్తు న్నామని ప్రభుత్వం చెబుతున్న ప్పటికీ ఐదు గంటలు కూడా రావడం లేదని తెలిపారు. కొన్ని రోజులుగా సమయ పాలన లేని విద్యుత్‌ కోతల వల్ల పైర్లకు నీరందక ఎండి పోతున్నా యని ఆందోళన వ్యక్తం చేశారు.
అధికారులకు పలు మార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని, ఇలాగే కొనసాగితే వరి పొలాలు ఎండిపోతాయని తెలిపారు. జలవనరుల నిండా నీరు, కోతలు లేని కరెంట్‌ ఉందన్న ధీమాతో పెద్దఎత్తున వరి సాగు చేశారని, వరి పొలాలకు ప్రస్తుతం నీటి అవసరం ఎంతో ఉండగా కరెంట్‌ కోతలు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని తెలిపారు. గతంలో మాదిరిగానే నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేసి రైతులను ఆదుకోవాలన్నారు.
నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి అంజిలయ్య గౌడ్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఉడుమలగిద్ద గోపాల్‌ మాట్లాడుతూ.. రైతులకు నిరంతరం 24 గంటల కరెంటు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం మాటలు నమ్మి బోరుబావుల కింద వరి, వేరుశనగ పంటలు సాగు చేసుకుంటున్నారని గుర్తుచేశారు. ఇప్పుడు సరిపడా విద్యుత్తు లేక నీరందక పంటలు ఎండిపోతున్నాయన్నారు. విద్యుత్‌ శాఖ అధికారులను అడిగినా సరైన సమాధానం ఇవ్వడం లేదన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి విద్యుత్‌ కోతలను ఎత్తివేయాలని కోరారు. విద్యుత్‌ శాఖ ఏఈ అనిల్‌ కుమార్‌ రైతుల దగ్గరకు వచ్చి వారం రోజుల్లో 24 కరెంటు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. అనంతరం ఆయనకు రైతులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మండల పరిషత్‌ మాజీ వైస్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌, నాయకులు జోషి, శివకుమార్‌, బాలరాజు, మహేష్‌, సాయిలు, భాస్కర్‌ రెడ్డి, పెంటప్ప, వివిధ గ్రామ రైతులు పాల్గొన్నారు.
తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట రైతుల ధర్నా
సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని సబ్‌ స్టేషన్‌ను రైతులు ముట్టడించారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిం చారు. వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరా సరిపడా రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు బైక్‌లను రోడ్డుపై అడ్డుగా పెట్టి నిరసన తెలిపారు నంగునూరు గ్రామంలో మూడ్రోజుల నుంచి విద్యుత్‌ కోతలు ఉన్నాయన్నారు. పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఫోన్‌ చేసినా స్పందించడం లేదని ఆరోపించారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ 24 గంటల కరెంటు ఇస్తున్నామని అసెంబ్లీలో చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. రాజగోపాల్‌పేట పోలీసులు రైతులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దేవులపల్లి యాదగిరి రైతులకు సంఘీభావం
తెలిపారు.