వేధింపులు తట్టుకోలేక…

– ఎంజీఎంలో పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
– ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తల్లిదండ్రుల ఆరోపణ
– వరంగల్‌లో ర్యాగింగ్‌కు పాల్పడిన వారిని అరెస్టు చేయాలి
– నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలి : ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజీ (కేఎంసీ)లో జూనియర్‌ విద్యార్థినిపై ర్యాగింగ్‌కు పాల్పడ్డ సీనియర్లను ర్యాగింగ్‌ నిరోధక చట్ట ప్రకారం వెంటనే అరెస్ట్‌ చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌ఎల్‌ మూర్తి, టి నాగరాజు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేఎంసీలో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రీతి అనే విద్యార్థినిని వేధింపులకు గురి చేస్తూ సీనియర్‌ విద్యార్థి తీవ్రమైన చిత్రహింసలకు పాల్పడ్డారని తెలిపారు. తీవ్ర మనస్థాపానికి గురైన ఆ జూనియర్‌ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసిందని గుర్తు చేశారు. ఇలాంటి చర్యలకు సీనియర్‌ విద్యార్థులు పదే పదే పాల్పడుతున్నా కనీసం ప్రిన్సిపాల్‌ ర్యాగింగ్‌ చట్టాలపై అవగాహన కల్పించలేదని విమర్శించారు. ర్యాగింగ్‌కు పాల్పడే విద్యార్థులను హెచ్చరించే ప్రయత్నం కూడా చేయలేదని పేర్కొన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిం చిన ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో వరుసగా ర్యాగింగ్‌ ఘట నలు పెరి గిపోతున్నా యని తెలిపారు. వరుసగా ఇది రాష్ట్రంలో మూడో ఘటన అని వివరించారు. ర్యాగింగ్‌ రక్కసిని ఎదుర్కొనేందుకు పక్కాగా చట్టాలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అన్ని విద్యాసంస్థల్లో విద్యార్థి సంఘా లను భాగస్వాములను చేసి సదస్సులు నిర్వహించాలనీ, విద్యార్థులకు అవగాహన కల్పించాలని కోరారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే విద్యాసంస్థల్లో విద్యార్థి సంఘ ఎన్నికలను నిర్వహించాలని సూచించారు.
విషమంగా విద్యార్థినిఆరోగ్యం
వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నం కలకలం సృష్టించింది. కాకతీయ మెడికల్‌ కళాశాలలో అనస్తీషియా విభాగంలోని డాక్టర్‌ ప్రీతి బుధవారం తెల్లవారుజామున విధుల్లో ఉండగా హానికారకమైన ఇంజెక్షన్‌ తీసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన తోటి వైద్యులు ఎంజీఎం సూపరింటెండెంట్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మోహన్‌ దాస్‌కు సమాచారం అందించారు. వెంటనే ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఇంజెక్షన్‌ వల్ల పరిస్థితి విషమించుతుండటంతో మెరుగైన వైద్యం కోసం నిమ్స్‌కు తరలిస్తున్నారు. ఈ ఘటనపై విద్యార్థిని తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ప్రీతి కాకతీయ మెడికల్‌ కళాశాలలోని అనస్తీషియా విభాగంలో డాక్టర్‌ ధరావత్‌ ప్రీతి పీజీ మొదటి సంవత్సరం చదువుతున్నది. అదే కళాశాలలో పీజీ తృతీయ సంవత్సరం చదువుతున్న సైఫ్‌ అనే వైద్యుడు డాక్టర్‌ ప్రీతిని మానసికంగా వేధిస్తున్నట్టు కళాశాల ప్రిన్సి పాల్‌, డాక్టర్‌ మోహన్‌ దాస్‌కి ఫిర్యాదు చేసినా పట్టించు కోలేదు. దాంతో ఆమె తల్లిదండ్రులు మట్టెవాడ సీఐ రమేష్‌కు అప్పట్లో ఫిర్యాదు చేయగా సీఐ కేఎంసీ ప్రిన్సిపాల్‌ దృష్టికి తీసుకువెళ్లారు. రెండు రోజుల కిందట కళాశాల ప్రిన్సి పాల్‌ అనస్థీ షియా హెచ్‌ఓడీ డాక్టర్‌ నాగార్జునతో కలిసి విద్యార్థు లకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అయినా వేధింపులు తగ్గక పోవ డంతో ఆమె మానసిక వేదనకు గురై ఆత్మహత్యా యత్నం చేసినట్టు తల్లిదండ్రులు తెలిపారు. కాగా, ప్రీతి పరిస్థితి విషమించడంతో హైదరా బాద్‌లోని నిమ్స్‌కు తరలిం చినట్టు ఎంజీఎం సూపరింటెం డెంట్‌ తెలిపారు. పాయిజన్‌ ఇంజెక్షన్‌ వల్ల మల్టీ ఆర్గాన్స్‌ దెబ్బతిన్నట్టు తెలుస్తోందని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతోందని తెలిపారు.
వేధింపులు మా దృష్టికి రాలేదు ఎంజీఎం సూపరిండెంట్‌ వి.చంద్రశేఖర్‌
కాకతీయ మెడికల్‌ కళాశాలలో వేధింపులతో ఆత్మహత్యాయత్నం చేసిన వైద్య విద్యార్థినిపై వేధింపుల విషయం తమ దృష్టికి రాలేదని ఎంజీఎం సూపరిండెంట్‌ వి.చంద్రశేఖర్‌, కేఎంసి ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మోహన్‌ దాస్‌ తెలిపారు. ఈ సంఘటనపై ఎంజీఎం అకాడమీక్‌ హాల్లో వారు విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. పీజీ కళాశాలలో ర్యాగింగ్‌, వేధింపులపై తమకు విద్యార్థి ప్రీతి తమ దృష్టికి తీసుకురాలేదన్నారు. ప్రీతి తల్లిదండ్రులు మట్టేవాడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం సీఐ చెప్పే వరకు ఇలాంటి సంఘటనలు తన దృష్టికి రాలేదని తెలిపారు. సీిఐ చెప్పిన వెంటనే సంబంధిత హెచ్‌ఓడీతో కలిసి విద్యార్థులకు కౌన్సెలింగ్‌ చేసి హెచ్చరించామన్నారు.