సంక్షేమ బోర్డు ఏర్పాటుపై అసెంబ్లీలో ప్రకటన చేయాలి

– ఎంవీ యాక్ట్‌-2019ను సవరించాలి
 – కేరళ సవారి యాప్‌ తరహా యాప్‌ను తేవాలి
 – సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్‌
– ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌ ఆధ్వర్యంలో
– కలెక్టరేట్‌ ఎదుట ధర్నా
నవతెలంగాణ- సిటీబ్యూరో:

రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తూ వెంటనే అసెంబ్లీలో ప్రకటన చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్య దర్శి జె.వెంకటేష్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం ఏఐఆర ్‌టీడబ్ల్యూఎఫ్‌ సిటీ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో సుమారు 20 లక్షల మందికిపైగా రవాణా కార్మికులు పనిచేస్తుండగా, ప్రధానంగా ఆటో ,టాక్సీ ,క్యాబ్‌, గూడ్స్‌ రవాణ, స్కూల్‌, ప్రయివేటు బస్సులు వంటి వాటిలో డ్రైవర్స్‌, క్లీనర్లు, మెకానిక్‌ తదితర కార్మికులుగా ఉన్నారన్నారు. వీరికి ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయకపోగా.. చలాన్లు, పెనాల్టీలు, ఫీజులు పెంచుతూ వేధింపులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రవాణా కార్మికుల పరిస్థితుల్లో మార్పుల కోసం ఈ అసెంబ్లీ సమావేశాల్లో సంక్షేమ బోర్డు ఏర్పాటును ప్రకటించాలన్నారు. ఎంవీ యాక్ట్‌- 2019ను సవరించడంతో పాటు కేరళ సవారి యాప్‌ తరహా యాప్‌ని రాష్ట్రంలో ప్రభుత్వమే అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. 7వ తేదీన చలో ఇందిరాపార్కు కార్యక్రమం నిర్వహిస్తున్నామని, డ్రైవర్‌ సోదరులు వేలాదిగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వెంకటేష్‌ కోరారు. ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.శ్రీకాంత్‌ మాట్లాడుతూ రవాణా రంగ కార్మికులకు ఎదైనా ప్రమాదం జరిగి గాయపడి అంగవైక్యలమైన, అనారోగ్యం పాలైన ఎటువంటి సహాయం ఉండదని, ఆ సమయంలో పని, ఆదాయం ఉండకపోగా.. ఖర్చులు అధికంగా ఉంటాయన్నారు. అప్పులు చేసి కుటుంబాలను పోషించుకోవాల్సి వస్తుందని, అప్పులు తీర్చలేక జీవితకాలమంతా ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేరళలోని వామపక్ష ప్రభుత్వం అక్కడి రవాణారంగ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి వారి సంక్షేమానికి పాటుపడుతుందని గుర్తుచేశారు. తెలంగాణలోనూ సంక్షేమ బోర్డు ఏర్పాటుపై ఈ అసెంబ్లీ సమావేశాలలో ప్రకటన చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌ సెంట్రల్‌ కమిటీ కార్యదర్శి కె.అజరు బాబు మాట్లాడుతూ ప్రయివేట్‌ అగ్రిగేటర్స్‌ సంస్థల దోపిడీ నుంచి కేరళ ప్రజలను కాపాడటం కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం సవారి అనే యాప్‌ను ప్రయోగాత్మకంగా అమలు చేస్తుందని, అదే తరహాలో మనరాష్ట్రంలోనూ ప్రభుత్వమే ఒక యాప్‌ని తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ఏఐఆర్‌టీడబ్లూఎఫ్‌ సౌత్‌ కమిటీ కార్యదర్శి ఎల్‌.కోటయ్య మాట్లాడుతూ కార్మికులందరికీ ప్రమాద బీమా సౌక ర్యం కల్పిస్తూ పది లక్షల రూపాయలు ఇవ్వాలని, అర్హులైన వారికి డబుల్‌ ఇండ్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. కనీస వేతనాల జీవో 25ను వెంటనే గెజిట్‌గా మార్చి అమలు చేయాలన్నారు. అంతకు ముందు జిల్లా అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లుకు ప్రతినిధుల బృందం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఆర్‌ టీడబ్ల్యూఎఫ్‌ నగర అధ్యక్షుడు ఎండీ ఆసీఫ్‌, ఉపాధ్యక్షులు ఎండీ అలీ, లక్ష్మణ్‌, సౌత్‌ అధ్యక్షుడు బాబా, బాబర్‌ ఖాన్‌, సిటీ నాయకులు అబ్దుల్‌ నబి, మోయిన్‌, అల్లాబకాశ్‌, వాహీద్‌, హరిచారి, కె.సతీష్‌, హైదర్‌, లింగనాయక్‌, శ్యామ్‌ తదితరులు పాల్గొన్నారు.