సందేశాత్మకంగా.. అవసరానికో అబద్దం

మనిషి జీవితంలో నిజానికి ఎంత ఇంపార్టెన్స్‌ ఉందో అబద్దానికి కూడా అంతే ప్రాధాన్యత ఉందని చెప్పే సందేశాత్మక చిత్రమే ‘అవసరానికో అబద్దం’. ఝాన్సీ, కష్ణమూర్తి యలమంచిలి సమర్పణలో గ్లోబల్‌ ఎంపవర్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకంపై డాక్టర్‌ శివకుమార్‌ చికిన సహకారంతో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. త్రిగున్‌, రుబాల్‌ షేక్‌ రావత్‌ జంటగా ఆయాన్‌ బొమ్మాళిని దర్శకుడిగా పరిచయం చేస్తూ డాక్టర్‌ జై యలమంచిలి నిర్మిస్తున్న ఈ నూతన చిత్ర పూజా కార్యక్రమాలు శుక్రవారం రామానాయుడు స్టూడియోలో వైభవంగా ప్రారంభమయ్యాయి. హీరో,హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత దిల్‌ రాజు క్లాప్‌ కొట్టగా, తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడు దామోదర ప్రసాద్‌ కెమెరా స్విచాన్‌ చేశారు. నిర్మాత సురేష్‌ బాబు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు ఆయాన్‌ బొమ్మాళి మాట్లాడుతూ,’మహాభారతంలో శ్రీ కష్ణుడు కొన్ని సందర్భాల్లో అబద్దం ఆడవచ్చు అని చెప్పాడు. దానిని ఆదర్శంగా తీసుకుని కమర్శియల్‌ వేలో సినిమాటిక్‌గా సినిమా తీస్తే ఎలా ఉంటుందనే ఐడియాతో చేసిన కథ ఇది. ధర్మం కాపాడాలి అంటే ధర్మరాజుతోనే అబద్ధం ఆడించాలనే స్ట్రాంగ్‌ క్యారెక్టర్‌ హీరోది. మణిశర్మ మా సినిమాకు మ్యూజిక్‌ చేయడం చాలా సంతోషంగా ఉంది’ అని తెలిపారు. ‘ధర్మాన్ని గెలిపించాలి అనే ఉద్దేశంతో మేము చేస్తున్న మంచి ప్రయత్నమే ఈ సినిమా’ అని నిర్మాతలు కష్ణమూర్తి యలమంచిలి, డాక్టర్‌ జై యలమంచిలి అన్నారు.