సమస్యలతో సతమతం గుర్రాల చెరువు ప్రజానీకం

– తాగునీటి సరఫరా అస్తవ్యస్తం
– పారిశుధ్యం ప్రశ్నార్ధకం
నవతెలంగాణ – అశ్వారావుపేట
వేసవి సమీపించనేలేదు. కానీ మండలంలో నీటి ఎద్దడి ఛాయలు అపుడే పొడ చూపుతున్నాయి. మండలంలోని 2018 లో నూతనంగా ఏర్పడ్డ గుర్రాల చెరువు పంచాయితీలో త్రాగునీటి సరఫరా సరిగా లేక ఇబ్బందులు పడుతున్నామని సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ అనుదీప్ కు పలువురు మహిళలు వినతి పత్రం అందజేసారు. మంగళవారం నవతెలంగాణ ఆ పంచాయితీ సందర్శించ గా అక్కడ అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయి. 2017 వరకు మేజర్ పంచాయితీ అయిన అశ్వారావుపేట లో 16 వ, వార్డు గా గుర్రాల చెరువు, మారుతి నగర్ లను పంచాయితీల పునర్విభజనలో భాగంగా 2018 లో నూతన పంచాయితి గా ఏర్పాటు చేసారు. 2011 జనాభా గణాంకాలు ప్రకారం ఈ గుర్రాల చెరువు పంచాయితి రెండు ఆవాసాలు గా,234 గృహాల తో 896 మంది జనాభా ఉన్నారు. ప్రస్తుతం 8 వార్డుల పంచాయితి. ఈ పంచాయితీ పన్నులు రూపేణా పొందే సాలు సరి ఆదాయం రూ.94 వేలు లోపు ఉంటుంది. ఎస్.ఎఫ్.సి,టి.ఎఫ్.సి ద్వారా ప్రభుత్వం ఇచ్చే నిధులు రూ.1 లక్షా 6 వేలు మాత్రమే. ఈ పంచాయితీలో 2 బోరుబావులు తో మోటార్లు ఉన్నాయి.నీటి ట్యాంక్ లు 3 ఉన్నాయి.మిషన్ భగీరథ పధకం ద్వారా నీటి సరఫరా ఉన్నప్పటికీ కలుషితం అయిన నీరు వస్తున్నాయని అక్కడి ప్రజానీకం ఆవేదన చెందుతున్నారు.

పంచాయితీలో మొత్తం 21 వీధులు ఉన్నప్పటికి ఒకే ఒక సిమెంట్ రోడ్డు నిర్మించారు. మురిక కాలువలకు సైతం ఒక ఒక చోట పక్కా డ్రైనేజీ మాత్రమే ఉంది. దీంతో పారిశుధ్యం నిర్వహణ మాత్రం అంతంత మాత్రమే అని చెప్పుకోవాలి. ఈ గ్రామంలో ప్రభుత్వ రేషన్ దుకాణం లేకపోవడంతో 3 కి.మీ దూరంలో ఉన్న అశ్వారావుపేట కు వెళ్ళి ఉచిత బియ్యం తెచ్చుకోవడానికి కనీసం రూ.50 లు ఖర్చు అవుతుందని గ్రామస్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ పంచాయితీలో 70 శాతం ప్రజానీకం దళితులు,వెనుకబడిన కులాలకు చెందిన వారే కావడంతో పూరి గుడిసెల లోనే అత్యధికులు జీవనం సాగిస్తున్నారు. అయితే ఇటీవల అశ్వారావుపేట ను నగర పంచాయితీ గా రూపొందించడానికి జిల్లా అధికారులు కార్యాచరణ చేపట్టగా ఈ పంచాయితీకి సైతం అశ్వారావుపేట నగర పంచాయితీలో విలీనం చేయాలని పంచాయితి తీర్మాణం చేయడం గమనార్హం. అరకొర నిధులు,విద్యుత్ కొరత వేధిస్తున్నాయి – సర్పంచ్ దుర్గయ్య. చిన్ని పంచాయితీ కావడంతో పన్నులు రూపంతో అల్ప ఆదాయం, ప్రభుత్వం ఇచ్చే అరకొర నిధులు అభివృద్ది పరంగా వేధిస్తున్నాయి. ప్రభుత్వం పంచాయితీలకు ఇచ్చే గ్రాంట్ విద్యుత్ చార్జీలు, హరితం హారం, ట్రాక్టర్ నిర్వహణ కే సరిపోతుంది. దీంతో అభివృద్ది కి నిధులు లేక సతమతం అవుతున్నాం. మంచి నీటి సరఫరాకు సైతం తరుచూ సంభవించే విద్యుత్ అంతరాయం అడ్డంకిగా మారింది.