సమాజంలో సంస్కృతీసంప్రదాయాల పాత్ర కీలకం

– మంత్రి జగదీశ్‌రెడ్డి
– భేరీలు వాయించి పెద్దగట్టు జాతర ప్రారంభం
– వైభవంగా మకరతోరణం తరలింపు
నవతెలంగాణ-సూర్యాపేట
సమాజాన్ని క్రమపద్ధతిలో నడపడంలో ఆయా ప్రాంతాలు, వర్గాల సంస్కృతీ సంప్రదాయాల పాత్ర కీలకమని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలోని పెద్దగట్టు జాతరలో తొలిఘట్టమైన మకరతోరణం తరలింపు ప్రక్రియను శనివారం స్థానిక గొల్లబజార్‌, ఎల్లమ్మగుడిలో ప్రత్యేక పూజలు చేసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌తో కలిసి మంత్రి భేరీలు వాయించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్‌ నాయకత్వంలోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో అన్ని కులాలు, మతాలకు సమన్యాయం కల్పించామని చెప్పారు. ప్రజలను ఐక్యం చేయడంలో పెద్దగట్టు వంటి జాతరలు దోహదపడుతాయన్న మంత్రి.. తెలంగాణలో రెండో అతి పెద్ద జాతరకు ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు. ఆదివారం రాత్రి కేసారం నుంచి దేవరపెట్టే తరలింపు అనంతరం సోమవారం నుంచి సందర్శకులు వస్తారని తెలిపారు. మూడ్రోజుల పాటు రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా 15 లక్షల మంది వరకు తరలివస్తారని అంచనా వేశారు. ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దగట్టు చైర్మెన్‌ కోడి సైదులు, డీసీఎంఎస్‌ ఉమ్మడి నల్లగొండ జిల్లా చైర్మెన్‌ వట్టె జానయ్య యాదవ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, జెడ్పీటీసీ జీడి భిక్షం తదితరులు పాల్గొన్నారు.