సమ్మెతో దిగొచ్చిన మహా సర్కారు

– విద్యుత్‌ సంస్థలు ప్రయివేటీకరించం,,,
– ఉద్యోగులకు రాతపూర్వక హామీ… సమ్మె విరమణ
ముంబయి : రాష్ట్రంలో ప్రభుత్వ విద్యుత్‌ సంస్థల ప్రయివేటీకరణ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. విద్యుత్‌ కార్మికులు, ఉద్యోగుల సమ్మెతో ఎట్టకేలకు దిగొచ్చింది. విద్యుత్‌ సంస్థలను ప్రయివేటీకరించబోమని వారికి హామీ ఇచ్చింది. దీంతో సమ్మెబాట పట్టిన విద్యుత్‌ కార్మికులు, ఉద్యోగులు తమ ఆందోళనను విరమించారు.
సమ్మె దేనికి?
రాష్ట్రంలోని మహారాష్ట్ర రాష్ట్ర స్టేట్‌ ఎలక్ట్రిసిటీ జనరేషన్‌ కో., మహారాష్ట్ర స్టేట్‌ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్‌మిషన్‌ కో., మహారాష్ట్ర స్టేట్‌ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్‌ కో. మూడు ప్రభుత్వ విద్యుత్‌ సంస్థలను ప్రయివేటీకరించే చర్యలను విద్యుత్‌ సంస్థల ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వ సంస్థల్లో ప్రయివేటు వ్యక్తుల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు, కార్మికులు నిరసనలు చేస్తున్నారు. ముఖ్యంగా థానే, నవీ ముంబయిలో విద్యుత్‌ పంపిణీ కోసం లైసెన్స్‌ కోరుతున్న అదానీ గ్రూపు ప్రతిపాదనను ఉద్యోగులు, కార్మికులు వ్యతిరేకించారు. అనిల్‌ అంబానికి చెందిన రిలయన్స్‌ ఎనర్జీని 2017లో చేజిక్కించ్చుకొని అదానీ ఎలక్ట్రిసిటీ ఇప్పటికే ముంబయి నగరంలోని పలు ప్రాంతాలలో విద్యుత్‌ పంపిణీని చేస్తున్నది. థానే, నవీ ముంబయిల్లోనూ విద్యుత్‌ పంపిణీకి లైసెన్స్‌ కోరుతూ అదానీ గ్రూపు గతేడాది నవంబర్‌లోనే మహారాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ (ఎంఈఆర్‌సీ)ని ఆశ్రయించింది. రాబోయే ఐదేండ్లలో రూ. 5,700 కోట్లతో విద్యుత్‌ పంపిణీ నెట్‌వర్క్‌ను (ప్రభుత్వ సంస్థ ఎంఎస్‌ఈడీసీఎల్‌కు సమాంతరంగా) నిర్మించడానికి ప్రణాళికలూ రచించింది.
అదానీ గ్రూపు ప్రవేశంతో ఈ మూడు సంస్థలకు చెందిన ఉద్యోగులు, కార్మికులు అప్రమత్తమయ్యారు. ప్రయివేటు కంపెనీల ప్రవేశంతో ప్రభుత్వ రంగ కంపెనీల ఆదాయంపై ప్రభావం పడుతుందని యూనియను ఆరోపించాయి. దీంతో ప్రభుత్వ కంపెనీ ఆర్థికంగా నష్టపోయి విద్యుత్‌ను కొనలేకపోవడమైనా, పేద వినియోగదారులకు విద్యుత్‌ను అందించలేకపోవడమైనా జరుగుతుందని ఆలిండియా పవర్‌ ఎనర్జీస్‌ ఫెడరేషన్‌ చైర్మెన్‌ శైలేంద్ర దూబే ఆరోపించారు.
కొన్ని రోజులగా నిరసనలు
ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా వారు గత కొన్ని రోజుల నుంచి ఆందోళనలు సైతం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా బుధవారం నుంచి కార్మికులు, ఉద్యోగులు 72 గంటల సమ్మెకు పిలుపునిచ్చారు. నిర్దేశిత సమ్మె ప్రకారం విద్యుత్‌ ఉద్యోగులు, కార్మికులు ఆందోళనలో పాల్గొన్నారు. ఈ మూడు విద్యుత్‌ సంస్థలకు చెందిన వేలాది మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. ఫలితంగా మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ కోతలు కనిపించాయి.
యూనియన్లతో ప్రభుత్వం చర్చలు
సమ్మె ఎఫెక్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కదిల్చేలా చేసింది. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌, ప్రభుత్వ అధికారులు.. బుధవారం మధ్యాహ్నం ఉద్యోగ యూనియన్లతో సమావేశమయ్యారు. విద్యుత్‌ కంపెనీలను ప్రయివేటీకరించే ప్రణాళిక లేదనీ, అదనంగా ప్రభుత్వం ఈ ప్రభుత్వ విద్యుత్‌ సంస్థల్లో మరింత పెట్టుబడులకు ప్రణాళికలు రచిస్తున్నదని యూనియన్లకు ఫడ్నవీస్‌ హామీ ఇచ్చారు. ”రాష్ట్ర ప్రభుత్వం కంపెనీలను ప్రయివేటీకరించాలనుకోవటం లేదు. మరోపక్క, రానున్న మూడేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఈ మూడు కంపెనీలలో రూ. 50 వేల కోట్లను ఇన్వెస్ట్‌ చేయబోతున్నది” అని యూనియన్లతో సమావేశమనంతరం ఫడ్నవీస్‌ చెప్పారు. అదానీ లైసెన్స్‌ ప్రతిపాదన ప్రారంభదశలోనే ఉన్నదన్నారు. ప్రభుత్వ హామీతో దిగొచ్చిన విద్యుత్‌ సంస్థల ఉద్యోగులు, కార్మికులు సమ్మెకు ముగింపు పలికారు.