సర్‌ప్రైజ్‌ చేసే స్కామ్‌

‘మా చాగంటి ప్రొడక్షన్‌ బ్యానర్‌లో ఫస్ట్‌ ప్రాజెక్ట్‌గా వస్తున్న చిత్రం ‘సిఎస్‌ఐ సనాతన్‌’. ఇదొక అద్భుతమైన థ్రిల్లర్‌’ అని అంటున్నారు నిర్మాత అజరు శ్రీనివాస్‌. ఆది సాయికుమార్‌, మిషా నారంగ్‌ జంటగా శివ శంకర్‌ దేవ్‌ దర్శకత్వంలో ఆయన నిర్మించిన చిత్రమిది. ఈనెల 10న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘ఆది సాయికుమార్‌కి ఈ మూవీ చాలా పెద్ద విజయం ఇస్తుంది. అలాగే ఇందులోని ప్రతి పాత్రకూ ప్రాధాన్యం ఉంటుంది. ఇలాంటి సినిమాలకు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనీష్‌ సోలోమాన్‌ ఇచ్చిన ఆర్‌ఆర్‌ ఖచ్చితంగా థియేటర్స్‌లో మోగిపోతుందని చెప్పగలను. టైటిల్‌ సాంగ్‌ నెక్ట్స్‌ లెవల్లో ఉంటుంది. మా డి.వో.పి శేఖర్‌ ది బెస్ట్‌ సినిమాటోగ్రఫీ అందించాడు. దర్శకుడు శివశంకర్‌ దేవ్‌ అద్భుతంగా తెరకెక్కించారు. ట్రైలర్‌ చూసిన తర్వాత అందరూ చాలా బావుందని, థ్రిల్లింగ్‌గా ఉందని ప్రశంసలు కురిపించడంతో సినిమాపై మరింత నమ్మకం పెరిగింది. ఒక కంపెనీ సిఇవో మర్డర్‌ మిస్టరీ ఇన్వెస్టిగేషన్‌ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ ఈ మధ్య కాలంలో ఎప్పుడూ చూడనంత సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. అలాగే ప్రస్తుతం ఇండియాలో చాలామందిని సర్‌ప్రైజ్‌ చేసిన ఓ పెద్ద స్కామ్‌కు సంబంధించిన ఇష్యూ ఉంటుంది. ఈ ఇష్యూతో ప్రతి ప్రేక్షకుడూ కనెక్ట్‌ అవుతాడు. ఈ సినిమాకి సీక్వెల్‌ని కూడా ప్లాన్‌ చేసుకున్నాం. ‘వేదాంత్‌’ అనే టైటిల్‌తో మరో సినిమా చేస్తున్నాం’ అని తెలిపారు.