‘సహకార’పై కేంద్రం పెత్తనం!

బహుళ రాష్ట్ర సహకార సంఘాల (ఎంఎస్‌సిఎస్‌) పేరిట వివిధ రాష్ట్రాల్లోని సహకార సంఘాలపై పెత్తనం చలాయించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వాస్తవానికి సహకార సంఘాలు రాష్ట్ర జాబితాలోని అంశం. భారత రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్‌లో రాష్ట్ర జాబితాలోని 32అంశాల్లో సహకార సంఘాలు ఒకటి. అయినా, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయడం రాష్ట్రాల హక్కుల్లోకి చొరబడడమే. ఫెడరల్‌ స్ఫూర్తికి విఘాతం కలిగించడమే! ఆ శాఖ మంత్రిగా కేంద్ర కేబినెట్‌లో సర్వ శక్తిమంతుడైన అమిత్‌ షాను నియమించడం కూడా సహకార సంఘాలను కేంద్రం అజమాయిషీ లోకి, ఆ తరువాత బీజేపీ రాజకీయ ప్రభావంలోకి లాక్కోవాలని మోడీ సర్కారు యోచిస్తున్నది. కేంద్ర సహకార మంత్రిత్వశాఖ ఏర్పాటుపై 2021 జులైలో ప్రకటన చేసినప్పటినుండి అనేక రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా వందేండ్లు పైబడి సహకార సంఘాలను విజయవంతంగా నడుపుతున్న కేరళ రాష్ట్రం మోడీ సర్కారు ఎత్తులను ఆది నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. సహకార వ్యవస్థను విస్తారంగావించిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ప్రముఖమైనది. చక్కెర రంగంలో అద్భుత ఫలితాలు సాధించింది. అలాగే పాడి రంగంలో గుజరాత్‌, ఆ కర్నాటక వంటివి సహకార వ్యవస్థ ద్వారా అటు పాల ఉత్పత్తిదార్లకు, ఇటు వినియోగదార్లకు ప్రయోజనకరంగా నిర్వహిస్త్నున్నాయి. అయితే, గ్రామ సీమల్లో సహకార సొసైటీల విస్తరణ, నిర్వహణ ద్వారా ఆయా రాష్ట్రాల్లోని కొన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తమ ప్రభావాన్ని పెంచుకున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ రాజకీయ పట్టు సాధించడానికి సహకార రంగాన్ని సాధనంగా చేసుకోవాలన్న ఎత్తుగడను అమలు చేయడానికే ఈ ఎంఎస్‌సిఎస్‌ తీసుకొచ్చారు. ఇప్పటికే గుజరాత్‌ వారి వశమైంది. మహారాష్ట్ర, కర్నాటకల్లో ప్రయత్నిస్తున్నా అక్కడి ప్రతిపక్షాల పట్టు నుండి తప్పించలేకపోతున్నారు. కేరళలో అది అసాధ్యంగా ఉంది. అందుకనే సహకారాన్ని కేంద్రం పరిధికి తీసుకొచ్చే ఈ కొత్త యత్నం. బహుళ రాష్ట్ర సహకార సంఘాల (సవరణ) బిల్లు, 2022ను లోక్‌సభలో గతేడాది డిసెంబర్‌ 7న ప్రవేశపెట్టారు. రానున్న బడ్జెట్‌ సెషన్‌ రెండో భాగంలో జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ నివేదికను ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైనా సహకార సంఘం ప్రస్తుతం ఉనికిలో ఉన్న ఎంఎస్‌సిఎస్‌లో కలిసేలా ఈ బిల్లు అవకాశం కల్పిస్తుంది. తద్వారా కొన్ని సహకార సంఘాలను ఎంఎస్‌సిఎస్‌ పరిధిలోకి తీసుకొస్తారు. అలాగే సహకార ఎన్నికల యంత్రాంగాన్ని కూడా కేంద్రం ఏర్పాటు చేస్తుంది. ఆ విధంగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాల అజమాయిషీలో నున్న సహకార వ్యవస్థ కేంద్రం పరిధికి క్రమంగా పోతుందన్నమాట. ఇది రాష్ట్రాల అధికారాల్లో కేంద్రం జోక్యం చేసుకోవడమే. ‘ఒకే దేశం – ఒకే భాష’, ‘ఒకే దేశం – ఒకే పన్ను’ లాగే ‘ఒకే దేశం – ఒకే రిజిస్ట్రేషన్‌’ విధానాన్ని తీసుకురావాలని యోచిస్తోంది. అంటే ఇది మరో జిఎస్‌టి లాంటిదే! సహకార రంగం అనేది రాష్ట్ర జాబితాలో ఉన్న అంశమైనప్పటికీ కేంద్రం రాష్ట్రాలను కనీసం సంప్రదించకుండా సమాఖ్య స్ఫూర్తికి, రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా కేంద్ర మంత్రి రాష్ట్రాల సహకార శాఖ కార్యదర్శులకు, సొసైటీల రిజిస్ట్రార్లకు నేరుగా ఆదేశాలు జారీ చేయడం నిరంకుశత్వానికి నిదర్శనం.