సహకార ఉద్యమ నేత ఎఎల్‌మల్లయ్య మృతి

– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని, చెరుపల్లి సంతాపం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సామాజిక సహకార ఉద్యమ నేత, కొండ లక్ష్మణ్‌ బాపూజీ సహచరులు ఎఎల్‌ మల్లయ్య (85) శనివారం మధ్యాహ్నం హైదరాబాదులో గుండె పోటుతో మృతి చెందారు. ఆయన మరణం బాధాకరమంటూ సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యుల ను పరామర్శించారు. చేతి వత్తిదారులందరూ సమాజంలో అభివృద్ధి చెందాలంటే సహకార రంగం ఎంతో ఉపయోగమనీ, దాని నిర్మాణానికి కృషి చేసిన వారిలో మల్లయ్య ముఖ్య పాత్ర పోషించారని తెలిపారు. జీవితకాలమంతా గంగపుత్రుల అభివృద్ధికి మత్స్యకారుల చైతన్యానికి ఎనలేని కృషి చేశారని గుర్తుచేశారు. వారి మరణం అణగారిన సామాజిక వర్గాలకు తీరని లోటని చెప్పారు. మల్లయ్యకు నివాళులర్పించినవారిలో తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు ఎంఎన్‌ శ్రీనివాస్‌రావు, హైదరాబాద్‌ నగర మత్య్స కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు కొప్పు పద్మ, మూఠా విజరు కుమార్‌ తదితరులు ఉన్నారు.
మల్లయ్య మృతికి రేవంత్‌రెడ్డి సంతాపం
తెలంగాణ ప్రదేశ్‌ గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏ ఎల్‌ మల్లయ్య మరణం పట్ల టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం తెలిపారు. మల్లయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పార్టీ నేతలు మహేష్‌కుమార్‌గౌడ్‌, అంజన్‌కుమార్‌గౌడ్‌, ఫిషర్మెన్‌ విభాగం రాష్ట్ర చైర్మెన్‌ మెట్టుసాయికుమార్‌, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తదితరులు ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు.