సాగుకు పుష్కలంగా నీరు

–  నిజాంసాగర్‌కు గోదావరి నీరు కాళేశ్వరం ఘనత
–  బాన్సువాడ అభివృద్ధికి రూ.50 కోట్లు : ముఖ్యమంత్రి కేసీఆర్‌
నవతెలంగాణ-నసురుల్లాబాద్‌
గోదావరి నీరు నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి రావడంతో ప్రాజెక్టు ఎప్పటికీ ఎండకుండా రైతులకు సాగునీరు అందిస్తుందని సీఎం కేసీఆర్‌ చెప్పారు. పంటలకు పుష్కలంగా నీరందిస్తూ నిజాంసాగర్‌ ప్రాజెక్టు ఆయకట్టు సస్యశ్యామలంగా కనిపిస్తుందన్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్‌ మండలం తిమ్మాపూర్‌లోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో శ్రీలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన కల్యాణోత్సవంలో సీఎం కేసీఆర్‌ దంపతులు పాల్గొన్నారు. సందర్శకులు సమర్పించిన రెండు కిలోల బంగారంతో చేయించిన కిరీటాన్ని ఆలయ ధర్మకర్త, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి స్వామివారికి సమర్పించారు. అనంతరం నిర్వహించిన కృతజ్ఞత సభలో సీఎం మాట్లాడారు. ‘సమైఖ్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సాగునీటి కోసం రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆనాడు పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిజామాబాదులో నీటి కోసం ధర్నా చేశారు. నేడు ఎలాంటి ఇబ్బందీ లేకుండానే పంటలకు సాగునీరు వస్తుందని’ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్నారు. అందుకే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడామని చెప్పారు. ఆలయ అభివృద్ధి కోసం మరో రూ.7 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. అదే విధంగా బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులు ఇస్తామని తెలిపారు. ఈ నిధులు దుర్వినియోగం చెందకుండా పనులు చేయించుకోవాలని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి సూచించారు. మిగతా నియోజకవర్గం ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు నిరాశ చెందకుండా వారికి కూడా నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల, రైతుల సమస్యలను గుర్తించి పరిష్కారం చేసే నాయకుడు పోచారం శ్రీనివాస్‌రెడ్డి అని, బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండటం ఇక్కడ ప్రజల అదృష్టం అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్‌, రాష్ట్ర ఆర్టీసీ చైర్మెన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, జడ్పీ చైర్మెన్‌ విఠల్‌రావు, శోభ, ఎమ్మెల్యేలు హన్మంత్‌ షిండే, జాజాల సురేందర్‌, బిగాల గణేష్‌ గుప్తా, బీసీసీఐ చైర్మెన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ముందస్తు అరెస్ట్‌
బీర్కూర్‌లో సీఎం కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో పలువురు నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ మండలంలోని మంచిప్ప గ్రామ సర్పంచ్‌ ఇందూరు సిద్ధార్థను, తూర్పు రాజేష్‌ గోల్ల శ్రీనివాస్‌ను ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. బోధన్‌ షుగర్‌ ఫ్యాక్టరీ నాయకులను ముందస్తుగా అదుపులోకి స్టేషన్‌కు తరలించారు.