సాగునీరు పుష్కలం – రాష్ట్రం సస్యశ్యామలం

– సమాచార శాఖ ప్రకటన
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
సాగునీటి రంగం అభివద్ధిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలు దేశానికే దిక్సూచిగా నిలిచాయి. 2014లో రాష్ట్ర అవతరణ తర్వాత సాగునీటి రంగానికి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం సాహసోపేతమైన అనేక చర్యలు తీసుకుంది. ప్రభుత్వం సాగునీటి పారుదలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వడంతో గత ఎనిమిదేండ్ల వ్యవధిలో రాష్ట్ర నీటి పారుదల రంగం అత్యున్నతస్థానానికి చేరింది. తెలంగాణ సస్యశ్యామలం కావాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చిరకాల కొరిక నెరవేరటంలో ఎన్నో మైలురాళ్ళున్నాయి. నీటి ప్రాజెక్టుల రూపకల్పన, వాటిని నిర్ధేశించిన వ్యవధిలో పూర్తి చేసేందుకు పడిన తపన అంతా ఇంతా కాదు. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర గణాంక 2022 నివేదిక ప్రకారం సాగునీటి విస్తీర్ణం 2014 సంవత్సరంలో కేవలం 62 లక్షల 48 వేల ఎకరాలకు ఉండగా, 2022 నాటికి సాగునీటి విస్తరణ 1 కోటి 35 లక్షల 60వేల ఎకరాలకు పెరిగింది. 2014 రాష్ట్రంలోని సాగునీటి అత్యవసరాలను దష్టిలో పెట్టుకుని ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ , రీ ఇంజినీరింగ్‌ వంటి వినూత్న ప్రణాళికతో కార్యక్షేత్రంలోకి దిగిన ప్రభుత్వం , విజయవంతంగా ఎన్నో ప్రాజెక్టులను చేపట్టింది. 24 ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టుల పరిధిలో రాష్ట్రంలో 69.02 లక్షల ఎకరాల ఆయకట్టు కొనసాగుతున్నది. వాటి కింద రాష్ట్ర అవతరణ తర్వాత కొత్తగా 19.48 లక్షల ఎకరాలకు నీటిపారుదల సామర్థ్యం పెంచారు. 27 మధ్యతరహా ప్రాజెక్టుల పరిధిలో దాదాపు 3 లక్షల 4 వేల ఎకరాల అయకట్టుకు, చిన్న తరహా ప్రాజెక్టులు, లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుల పరిధిలో మరో 5 లక్షల 53 వేల ఎకరాలకు, మరో 9 మధ్యతరహా, భారీ ప్రాజెక్టుల పరిధిలో 21 లక్షల 33వేల ఎకరాలకు నీటి సరఫరా పెంచడం జరిగింది. కల్వకుర్తి , నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌ , ఎల్లంపల్లి , మిడ్‌మానేరు , దేవాదుల, తదితర అన్ని ప్రాజెక్టులనూ పూర్తిచేసింది.
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు: ఈ ప్రపంచంలోనే అతిపెద్ద సాగునీటి ఎత్తిపోతల ప్రాజెక్టు. విభిన్న రీతిలో డిజైన్‌ చేసిన భారీ ప్రాజెక్టు ఇది. తెలంగాణలో సాగునీటికి ఇంతవరకు నోచుకోని భూములకు నీటిని అందించేందుకు ప్రభుత్వం నిర్మించిన బహుళ దశల ప్రాజెక్టు కాళేశ్వరం. ఈ ప్రాజెక్టులో భాగమైన అన్నపూర్ణ, రంగనాయకసాగర్‌, కొండపోచమ్మసాగర్‌ రిజర్వాయర్ల ద్వారా ఆయా ప్రాంతాలకు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. సాధారణంగా రిజర్వాయర్ల నిర్మాణం నదీ మార్గంలో జరుగుతుంది. కానీ, దీనికి భిన్నంగా నదీ , వాగు, ఏదీలేనిచోట అతిపెద్ద రిజర్వాయర్‌ మల్లన్నసాగర్‌ నిర్మాణం కావడం సాగునీటిరంగ చరిత్రలోనే ఒక అధ్బుతం. అంతే కాకుండా గోదావరినీటిని 90 మీటర్ల నుంచి 618 మీటర్లకు ఎత్తినీటిని తరలించే బహత్తర కార్యాచరణ ఇందులో ప్రధానాంశం. అసాధ్యాన్ని సుసాధ్యం చేయటంలో తనకు తానే సాటి అని తెలంగాణ ప్రభుత్వం నిరూపించుకున్నది. గోదావరి నది పై మూడు బ్యారేజీలు, 20 మెగా నీటి లిఫ్ట్‌లు ,21 పంపుహౌజ్‌లు , 180 రిజర్వాయర్లతో పాటు 1832 కి.మీ పొడవునా సొరంగమార్గాలు, పైపులైన్లు, కెనాళ్లు నిర్మించారు. మూడు సంవత్సరాల వ్యవధిలో అతి భారీ ప్రాజెక్టును పూర్తి చేసి రికార్డు సృష్టించింది.
సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ : గోదావరి నీటిని తరలించి భద్రాద్రి – కొత్తగూడెం , ఖమ్మం , మహబూబాబాద్‌ జిల్లాల్లోని 6.74 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ చేపట్టింది. ప్రాజెక్టు నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2014లో 68 లక్షల మెట్రిక్‌ టన్ను లున్న వరి ధాన్యం ఉత్పత్తి 2022 నాటికి 2.49 కోట్ల మెట్రిక్‌ టన్నులకు పెరిగింది. మిషన్‌ కాకతీయ పథకం కింద చెరువులు బాగు చేయడంతో చెరువుల కింద 25 లక్షల ఎకరాలు సాగవుతు న్నాయి. భూగర్భజలాలు రాష్ట్ర వ్యాప్తంగా గణనీయంగా పెరిగి వ్యవసాయ సాగు కూడా రెట్టింపవుతున్నది. రాష్ట్ర స్తూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) కూడా గణనీయంగా పెరుగుతున్నది.
నీటితీరువా పన్ను రద్దు : తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి ముందు రైతులు చెల్లిస్తున్న నీటితీరువా పన్ను బకాయిలను కేసీఆర్‌ సర్కారు ఏర్పడిన తర్వాత రద్దు చేసింది. అంతే కాకుండా శాశ్వతంగా నీటిపన్నును రద్దుచేసి, రైతులకు ఉచితంగా సాగునీటిని అందిస్తున్నది. ఈ మేరకు శనివారం రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్‌ ప్రకటన విడుదల చేశారు.