సీసీటీవీ ట్యాంపరింగ్‌పై కేసు నమోదు

– స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు
– ఆన్‌లైన్‌ మూల్యాంకనంతో ఎన్నో ప్రయోజనాలు
– ఇంటర్‌ విద్య కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఇంటర్‌ విద్య కమిషనర్‌ కార్యాలయం నుంచి డేటా చోరీకి పాల్పడేందుకు సీసీటీవీ ట్యాంపరింగ్‌ జరిగినట్టు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు ఇంటర్‌ విద్య కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌తెలిపారు. సోమవారం హైదరాబాద్‌ నాంపల్లిలోని ఇంటర్‌ విద్య కమిషనర్‌ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంటర్‌ పరీక్షల మూల్యాంకనాన్ని కంప్యూటరైజ్‌డ్‌ చేయడం ద్వారా ఎన్నో ప్రయోజనాలుంటాయని తెలిపారు. తొందరగా ఫలితాలు రావడంతో పాటు రీకౌంటింగ్‌, రీవాల్యుయేషన్‌ కూడా వేగంగా చేయవచ్చని తెలిపారు. తొలి దశలో ఆర్ట్స్‌, కామర్స్‌, లాంగ్వేజెస్‌ను ఆన్‌లైన్‌ మూల్యాంకనం చేపడుతామనీ, రెండేండ్లలో సైన్స్‌ సబ్జెక్టులను సైతం అందులోకి చేర్చేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. కొంత మంది అవగాహన లేని, అర్హత లేని వ్యక్తులు చేసే తప్పుడు ప్రచారంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురి కావద్దని సూచించారు. ఏసీబీ కేసుతో పాటు అట్రాసిటీ, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇంటర్‌ విద్య ప్రక్షాళన కోసం చేపడుతున్న సంస్కరణలపై మాట్లాడే అవసరం ఏముంటుందని ప్రశ్నించారు. ఒకసారి స్క్రిప్ట్‌ సిస్టమ్‌లోకి వెళితే లెక్చరర్లకు తర్వాత పేపర్లు ర్యాండమ్‌ గా వస్తాయని వివరించారు. ఆఫ్‌లైన్‌లో పేపర్లు దిద్దేందుకు లెక్చరర్లు క్యాంపుల వద్దకు రావడం ఖర్చుతో కూడుకున్నదనీ, ఈ విధానంలో ఎక్కడి నుంచైనా దిద్దేందుకు వెసులుబాటు కలుగుతుందన్నారు. మానవ తప్పిదాలకు అవకాశముండదనీ, మార్కుల మొత్తం కంప్యూటర్‌ గణిస్తుందన్నారు. ఇందు కోసం లెక్చరర్లకు రెండు ఆప్షన్లు ఇస్తున్నామనీ, తొలి ఆప్షన్‌ మూల్యాంకనం చేసే వారు తమ సొంత కంప్యూటర్‌, సొంత స్థలంలో చేసేందుకు ఎంచుకోవచ్చన్నారు. ఆ సౌకర్యం లేని వారు తాము ఏర్పాటు చేసే ప్రాంతాల్లో దిద్దేందుకు ఆప్షన్‌ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ తదితర యూనివర్సిటీల పరీక్షల నిర్వాహకులు ఆన్‌లైన్‌ మూల్యాంకనంలో తమ అనుభవాలను, వచ్చిన ఫలితాలను వివరించారు. ఈ సమావేశంలో స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ కార్యదర్శి శ్రీనాథ్‌, పీఏఎల్‌ఏ అధ్యక్షులు నాగరాజు, డాక్టర్‌ బీ.ఆర్‌.అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఏ.వీ.ఆర్‌.నర్సింహారెడ్డి, ఇంటర్‌ బోర్డు సీఇవో జయప్రదబాయి, జాయింట్‌ సెక్రెటరీ వై.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.