సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూపులకు రూ.750 కోట్లు

–  పురపాలికల్లో వడ్డీలేని రుణాలకు నిధులు విడుదల :మంత్రి కేటీఆర్‌ వెల్లడి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మహిళా దినోత్సవం సందర్భంగా పురపాలక సంఘాల పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాల కోసం రూ.250 కోట్ల వడ్డీ లేని రుణాల నిధులను విడుదల చేస్తున్నట్టు మంత్రి కే తారకరామారావు తెలిపారు. మరో రూ.500 కోట్ల నిధులను గ్రామీణ ప్రాంతాల్లో మహిళా స్వయం సహాయక సంఘాలకు విడుదల చేస్తున్నామని చెప్పారు. నిధులు కేటాయించినందుకు మహిళా సంఘాల తరఫున ఆయన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని 23 జిల్లాల పరిధిలోని పురపాలక పట్టణాల్లోని స్వయం సహాయక సంఘాలకు ఈ నిధులు అందుతాయని చెప్పారు. కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ వడ్డీ లేని రుణాల బకాయిలను మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు విడుదల చేశారన్నారు. మహిళా సంఘాల్లోని సభ్యులు అత్యంత ఆర్థిక క్రమశిక్షణతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని తిరిగి చెల్లిస్తున్నారని తెలిపారు. రీ పేమెంట్‌ ఆఫ్‌ లోన్స్‌ విషయంలో దేశంలోనే తెలంగాణ మహిళలు అగ్రస్థానంలో ఉన్నారన్నారు. రాష్ట్రంలోని పురపాలికల్లో లక్షా 77 వేలకు పైగా స్వయం సహాయక సంఘాలు ఉన్నాయని, ఇందులో దాదాపు 18 లక్షల మంది సభ్యులుగా ఉన్నారని వివరించారు. ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు రూ.15,895 కోట్ల రుణాలను లింకేజీ రూపంలో అందించిందన్నారు.
గొప్ప కానుక :మంత్రి ఎర్రబెల్లి
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు వడ్డీ లేని రుణాలను విడుదల చేస్తూ ఒక గొప్ప కానుక ఇచ్చిందని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు పేర్కొన్నారు. 750 కోట్ల రూపాయల భారీ నిధులను ఆడబిడ్డల కోసం విడుదల చేసిన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సోమవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. గత ప్రభుత్వాలు పదేండ్లలో రూ.21, 978 కోట్లు రుణాలిస్తే..కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక వివిధ బ్యాంకుల ద్వారా రూ.66,624 కోట్లను మహిళా సంఘాలకు రుణాలుగా ఇచ్చారని వివరించారు.