సైబర్‌ క్రైమ్‌తో జాగ్రత్త

– డ్రగ్స్‌తో ఎన్నో అనర్థాలు
– ట్రాఫిక్‌ నిబంధనలపై విద్యార్థులకు అవగాహన కల్పించిన ఏసీపీ
నవతెలంగాణ-సిటీబ్యూరో
అత్యాధునిక టెక్నాలజీ వాడకంతో ఎన్ని ప్రయోజనా లున్నాయో, అదే తరహాలో మోసాలున్నాయని బేగంపేట్‌ లోని ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌ ఏసీపీ జీ.శంకర్‌రాజు తెలిపారు. బుధవారం సైదాబాద్‌లోని ‘మాతృశ్రీ ఇంజనీరింగ్‌ ఆఫ్‌ కాలేజీ’లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏసీపీ మాట్లాడారు. రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని ఉపయోగించి నేరస్తులు మోసాలకు పాల్పడుతున్నారని అలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. ముఖ్యంగా అమాయకులను ఎంచుకుని వారిని మాటలతో మభ్యపెడుతున్న సైబర్‌ నేరస్తులు అందిన కాడికి దండుకుంటున్నారని చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తులు పంపించిన లింక్‌లను క్లిక్‌ చేయవద్దని, అలాంటి వారితో ఆర్థిక లావాదేవీలపై మాట్లాడొద్దన్నారు. ఏ బ్యాంక్‌ అధికారి కూడా ఫోన్‌లో ఆర్థిక లావాదేవీల వివరాలను సేకరించరన్నారు. ముఖ్యంగా ఓటీపీలు, కేవైసీ, బ్యాంక్‌ వివరాలను షేర్‌ చేయొద్దన్నారు. విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని కోరారు. తల్లిదండ్రులు మీపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా చదువులో రాణించాలన్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకపోవడంతో వచ్చే నష్టాలు, రోడ్డు ప్రమాదాలపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సైదాబాద్‌ ఎస్‌ఐ శివాజీ, గణేష్‌, ఏఎస్‌ఐ ఖదీర్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ సత్యనారాయణరెడ్డి, దాదాపు 500 మంది విద్యార్థులతో పాటు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ డి.మనుమంతరావు, అధికారి పి.నవీన్‌ కిషోర్‌, కాలేజీ సిబ్బంది పాల్గొన్నారు.