సొంతంగా ఎదుగుతోంది

సాధారణంగా సెలబ్రెటీల పిల్లలు కుటుంబ అండతో పరిశ్రమలోకి అడుగుపెడతారు. కానీ ఖతీజా రెహమాన్‌ అలా కాదు. చదువుకునే రోజుల్లోనే స్వచ్ఛంధ కార్యకర్తగా పని చేశారు. తనకున్న ప్రతిభతో వివిధ సామాజిక అంశాలపై పని చేస్తూ సొంతంగా ఎదుగుతున్నారు. ప్రస్తుతం ఎ.ఆర్‌.రెహమాన్‌ ఫౌండేషన్‌లో ఔట్‌రీచ్‌ ప్రోగ్రామ్స్‌ డ గ్లోబల్‌ ఇనిషియేటివ్స్‌ ట్రస్టీగా, డైరెక్టర్‌గా బాధ్యతలు చూస్తున్నారు. ప్రతిభ ఉండి ఆర్థికంగా వెనుకబడిన పిల్లలను దత్తత తీసుకుని వారికి సంగీతంలో శిక్షణ ఇస్తున్నారు. అంతేకాదు ఆమె కూడా స్వయంగా ప్రసిద్ధ సంగీత విద్వాంసురాలు. ఇటీవల సాగవాసిలో రాపర్‌ అరివుతో కలిసి పనిచేసిన ఆమె ఓ వెబ్‌ మ్యాగజైన్‌తో పంచుకున్న విశేషాలు నేటి మానవిలో…
నలుగురికి సహాయం చేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే కుటుంబంలో పెరిగారు ఖతీజా రెహమాన్‌. దారిన పోయే ప్రజలు దాహాన్ని తీర్చుకోవడానికి అమ్మమ్మ తమ ఇంటి బయట ఎప్పుడూ ఓ నీటి కుండను ఉంచేదని ఆమె గుర్తు చేసుకున్నారు. ”ఇంటికి ఎవరైనా వస్తే కనీసం ఒక గ్లాసు నీళ్ళు తాగకుండా ఆమె ఎవరినీ విడిచిపెట్టదు. నాన్న, అమ్మతో సహా మా కుటుంబంలో అందరూ అలాంటివారే. వారు అందరి పట్ల చూపించే ఈ చిన్నపాటి దయే నాకు స్ఫూర్తినిచ్చింది” అని ఖతీజా చెప్పారు. ఆమె స్వతహాగా ప్రశంసలు పొందిన సంగీత విద్వాంసురాలు. ఖతీజా ఎ.ఆర్‌.రెహమాన్‌ ఫౌండేషన్‌ రోజువారీ నిర్వహణలో దగ్గరి సంబంధం కలిగి ఉన్నారు. పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడే ఆమె లిటిల్‌ ఫ్లవర్‌ స్కూల్‌ ఫర్‌ ది బ్లైండ్‌లో, అడయార్‌ క్యాన్సర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో, యూత్‌ రెడ్‌క్రాస్‌ వారితో కలిసి స్వచ్ఛందంగా పనిచేశారు. ఇవన్నీ తనకు మంచి అనుభవాలను నేర్పాయని ఆమె అంటారు.
మూస పద్ధతులను బద్దలు కొట్టి
2016లో ట్రోంబోనిస్ట్‌ అయిన లిసా సరాసిని ఆధ్వర్యంలో ప్రారంభించబడిన బ్రాస్‌ ఎన్‌సెంబుల్‌ గురించి కూడా ఆమె పంచుకున్నారు. సాంప్రదాయకంగా సంగీత వాయిద్యాలతో ఆడుతూ, పాడటం అనేది పురుషుల పనిగానే కొనసాగుతుంది. ఎందుకంటే ఇది శారీరకంగా కూడా కష్టంతో కూడుకున్నది. అయితే ది సన్‌షైన్‌ ఆర్కెస్ట్రాలోని అమ్మాయి బ్రాస్‌ ప్లేయర్‌లు మూస పద్ధతులను బద్దలు కొట్టి కొత్త చరిత్రను సృష్టించినందుకు ఆమె గర్వపడుతున్నారు. ఫౌండేషన్‌ తన మొదటి ఔట్‌ రీచ్‌ కార్యక్రమాన్ని 2018లో చెన్నైలోని ప్రభుత్వ సహాయక పాఠశాల జనరల్‌ కరియప్ప స్కూల్‌లో ప్రారంభించింది.
కరుణామృతసాగరం
”మా సీనియర్‌ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు సంగీతం నేర్పుతారు. మేము వారిని విద్యార్థి అధ్యాపకులుగా నియమించాము. వారు ఆదాయాన్ని పొందడానికి, నాయకత్వ నైపుణ్యాలను నేర్చుకోవడానికి వారికి సహకరిస్తున్నాము. సంగీతం ఎవరికైనా మానసిక ఉత్సాహాన్ని, దృష్టి కేంద్రీకరించడంలో సహాయపడుతుంది” అని ఆమె జతచేస్తున్నారు. ఎ.ఆర్‌.రెహమాన్‌ ఫౌండేషన్‌ కరుణామృతసాగరం ప్రాజెక్ట్‌ను కూడా ప్రారంభించింది. అదే పేరుతో అబ్రహం పండితార్‌ రచించిన తమిళ సంగీతంపై గ్రంథం ఆధారంగా రూపొందించబడింది. ”ఈ ప్రాజెక్ట్‌తో మేము రాగాలు, పురాతన వాయిద్యాలు, తమిళ సంగీతానికి సంబంధించిన ఇతర అంశాలతో సహా చాలా సమాచారాన్ని ఆర్కైవ్‌ చేయడానికి పని చేస్తున్నాము” అని ఆమె వివరించారు. ఈ ప్రాజెక్ట్‌ 3,000 సంవత్సరాలకు పైగా తమిళ సంగీత పరిణామాన్ని, దాని శాస్త్రీయ పూర్వీకులు, జానపద సంగీతం నుండి కొత్త-యుగం సంగీతం వరకు అన్వేషిస్తుంది. ఫౌండేషన్‌ అత్యవసర సమయాల్లో సంగీతకారుల కుటుంబాలకు కూడా మద్దతు ఇస్తుంది. ”మన చుట్టూ ఉన్న వ్యక్తులకు మనం చేయగలిగిన విధంగా మద్దతు ఇవ్వడానికి మేము సంతోషిస్తున్నాం. మేము వారి కోసం ఉన్నామని ప్రజలకు తెలుసు” ఆమె చెప్పారు.
మద్దతు ఇవ్వండి
ఖతీజాలోని నిరాడంబరతే ఆమెను ఓ గొప్ప స్థాయికి చేరుస్తుంది. ”అంతా జట్టుచేత నడుస్తుంది. నిర్ణయాధికారం లేదా సమస్య పరిష్కార పరంగా వారికి మద్దతు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సోషల్‌ మీడియా, మార్కెటింగ్‌, వెబ్‌సైట్‌ మేనేజ్‌మెంట్‌లో కూడా నేను వారికి మద్దతు ఇస్తున్నాను. మీరు కూడా మీ ఇంటిలోని వ్యక్తులతో, మీ స్నేహితుల పట్ల మంచిగా ఉండటం ప్రారంభించండి. మీ స్నేహితులు చిన్న వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే దానికి మద్దతు ఇవ్వండి. నేను నా తోటి కళాకారులకు మద్దతు ఇవ్వడం ద్వారా పని ప్రారంభిస్తాను. అది కూడా సమాజానికి తిరిగి ఇవ్వడమే. నా చివరి రోజుల్లో నేను పోయినప్పుడు ఆమె ఎప్పుడూ ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు అని ప్రజలు చెప్పుకోవాలి” అంటూ తన భావాలను పంచుకున్నారు.
జీవితం, సంగీతం
ఖతీజా జీవితంలో దాతృత్వం, సంగీతం రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఆమె తన 14వ ఏట తన తండ్రి సంగీత దర్శకత్వంలో ఎస్పీ. బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ఎంథిరన్‌లో అరంగేట్రం చేశారు. ”మొదట పాడటానికి నిరాకరించాను. కానీ ‘నువ్వు వెళ్లి పాడటం మంచిది’ అని మా అమ్మ చెప్పింది. నేను పరీక్షను వదిలేసి వెళ్లి ఎంథిరన్‌ కోసం పుతియా మనిధ పాడాను. ఇదంతా చాలా తక్కువ కాలంలో జరిగింది. నేను కూడా మూడు భాషల్లో పాట పాడాను” అంటూ గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె ఎనిమిదేండ్ల విరామం తీసుకున్నారు. చదువుపై దృష్టి పెట్టారు. సంగీత ప్రపంచంలోకి తిరిగి రావడానికి ముందు స్వచ్ఛంద కార్యకర్తగా పని చేశారు.
నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది
ఖతీజా ‘అహింసా’లో ఐరిష్‌ రాక్‌ బ్యాండ్‌, ‘ఇల్తేజా’లో గ్రామీ అవార్డు గెలుచుకున్న సంగీతకారుడు రికీ కేజ్‌తో కలిసి పనిచేశారు. ఆమె సంగీతం ప్రపంచవ్యాప్త గుర్తింపును కూడా తెచ్చుకుంది. కోక్‌ స్టూడియో తమిళ్‌ సాగవాసి కోసం ఆమె ఇటీవల రాపర్‌ అరివుతో కలిసి చేసిన చిత్రం ఇప్పటికే యూట్యూబ్‌లో 15 మిలియన్లకు పైగా హిట్‌లను సాధించింది. ”ఇది భిన్నమైన అనుభవం. అరివు తన కళ ద్వారా చాలా శక్తివంతమైన సందేశాలను సమాజానికి అందిస్తారు. అతను రాసిన సాహిత్యాన్ని పాడినందుకు సంతోషిస్తున్నాను” అన్నారు. పాట వలె ప్రతిదీ సహజీవనం చేస్తుంది. అది కళకు అవసరం. అయితే ఖతీజా రెహమాన్‌ ”ఇంపోస్టర్‌ సిండ్రోమ్‌”తో బాధపడుతున్నారు. ”నేను వేరే ప్రదేశంలో ఉన్నాను. వ్యాధి వల్ల నేను బయట పాడటానికి ఆలోచిస్తున్నాను. ఆ సమయంలోనే నాకు ఈ కాల్‌ వచ్చింది. ఇది నాలో ఆత్మవిశ్వాసం పెంచుకునేందుకు సహాయపడింది. ఈ ఉత్సాహంతో నేను భవిష్యత్‌లో మరెన్నో చేయబోతున్నాను. ప్రణాళికలు రూపొందించుకుంటున్నాను” ఆమె చెప్పారు.
సామాజిక మార్పుకై…
సామాజిక మార్పు పట్ల ఖతీజాకు ఉన్న అభిరుచి వివిధ ప్రాంతాలకు విస్తరించింది. దాని గురించి వివరిస్తూ ”యువతతో కలిసి పనిచేయడం నాకు చాలా ఇష్టం. 2008లో కొంతమంది విద్యార్థులతో ప్రారంభమైన సన్‌షైన్‌ ఆర్కెస్ట్రా ఇప్పుడు నాగాలాండ్‌కు విస్తరించింది. ఎ.ఆర్‌.రెహమాన్‌ ఫౌండేషన్‌ మార్క్యూ ప్రాజెక్ట్‌ అయిన ది సన్‌షైన్‌ ఆర్కెస్ట్రా సంగీతంలో నైపుణ్యం ఉండి ఆర్థికంగా వెనుకబడిన పిల్లలను గుర్తిస్తుంది. వారికి ఉచిత సంగీత శిక్షణ అందిస్తుంది. వారు సరైన నైపుణ్యాలతో శిక్షణ తీసుకుని, తగినంత ఆత్మవిశ్వాసం పొందిన తర్వాత వారే శిక్షకులుగా లేదా ప్రదర్శకులుగా అవకాశాలు కల్పించుకుంటారు. తద్వారా కెరీర్‌ను రూపొందించుకుంటారు. ప్రారంభమైన నాటి నుండి ఇప్పటి వరకు ఆర్కెస్ట్రా 100 మంది విద్యార్థులను దత్తత తీసుకుంది” అన్నారు.

– సలీమ